కదంతొక్కిన ఆదివాసీలు
బీర్సాయిపేట నుంచి ఉట్నూర్‌కు పాదయాత్ర
300ల మంది వరకు హాజరైన గిరిజనులు
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, పీవోకు వినతి
ఉట్నూర్ రూరల్, న్యూస్‌లైన్ :
ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజనులు కదం తొక్కారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బీర్సాయిపేట గ్రామం నుంచి ఉట్నూర్ ఐటీడీఏ వరకు పాదయాత్రగా తరలివచ్చారు. మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. పాదయాత్రగా వచ్చిన గిరిజనులు ఐటీడీఏ వద్ద ధర్నా నిర్వహించారు. పీవో బయటికి వచ్చి వినతిపత్రం తీసుకురావాలని పలువురు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఐటీడీఏ సమావేశ మందిరంలో చొచ్చుకెళ్లేందుకు గిరిజనులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాతావరణం ఉద్రిక్తతంగా మారింది. పీవో బయటికి వచ్చి వారి సమస్యలను విన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్‌రావు మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధప్రతిపాదికన మౌళిక వసతులు కల్పించాలని కోరారు. అటవీ హక్కు చట్టంలో అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించి ఐటీడీఏ పరిధిలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో ఆదివాసీ గిరిజనులచే భర్తీ చే యాలని అన్నారు. మిగిలి ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు.
2013లో పంట నష్టపోయిన ఏజెన్సీ ప్రాంత రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని, ఐటీడీఏలోని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక సమావేశ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన పీవో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంద్రం జైవంత్‌రావు, ఉపాధ్యక్షుడు మండాడి చంద్రభాన్, గౌరవ అధ్యక్షుడు దశ్వంత్రావు, కోశాధికారి వెడ్మ విశ్వం, ఏవీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నైతం బాలు, నాయకులు మెస్రం శేకు, గజానంద్, సెడ్మకి సీతారాం ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు.