చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి.
జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు.
తిరువూరులో...
కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్