నేడు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం
16 వేల మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం
ముఖ్యఅతిథిగా జర్మనీ న్యాయమూర్తి పి.సి.రావు రాక
మూడు బంగారు పతకాలు విద్యార్థినులకే
వైస్ చాన్సలర్ ఆచార్య వి.వెంకయ్య వెల్లడి
సాక్షి, విజయవాడ : కృష్ణా యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమంగా పీజీ విద్యార్థులతోపాటు డిగ్రీ విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తున్నామని వైస్ చానల్సర్ ఆచార్య వి.వెంకయ్య చెప్పారు. గురువారం స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన యూనివర్సిటీ 2012 డిసెంబర్ 9న మొదటి స్నాతకోత్సవం జరుపుకొందని, శుక్రవారం రెండో స్నాతకోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు.
వర్సిటీలో ఇంజినీరింగ్, మెడిసిన్ మినహా అన్ని డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయని తెలి పారు. ఈ ఏడాది 16 వేల మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని, వీరిలో 2,276 మంది పీజీ విద్యార్థులు, 14,286 మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారని వివరించారు. ఈసారి డిగ్రీ విద్యార్థులకు కూడా స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. పాస్ పర్సెంటేజ్లో విద్యార్థినులే అధికంగా ఉన్నారన్నారు. పీజీ కోర్సులో ఎం.ఫార్మసీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తదితర కోర్సుల్లో మూడు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నామని, వీటికి విద్యార్థినులే ఎంపికయ్యారని వివరించారు.
విజయవాడలో స్నాతకోత్సవం ...
విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వర్సిటీ స్నాతకోత్సవం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా జర్మనీ దేశంలోని హేంబర్గ్‌లో ఉన్న అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు (పి.సి.రావు) ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు.
బంగారు పతక విజేతలు..
ఎంఫార్మసీలో బండి సుస్మితకు, ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పనకు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో మల్లాది దీప్తికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పారు.