భార్యను చంపి.. అడ్డొచ్చిన అత్తపై దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో దారుణం చోటుచేసుకుంది. తన పుట్టింట్లో తల్లిదండ్రులతో ఉంటున్న భార్యను విచక్షణ లేకుండా కత్తితో అతి దారుణంగా నరికేశాడో భర్త. ఈ ఘటన కొవ్వూరు 19వ వార్డు దొగ్గువారివీధిలో గురువారం చోటుచేసుకుంది. తన భర్త పెట్టే వేధింపులను భరించలేని భార్య వరలక్ష్మీ కొవ్వూరులోని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త నర్సింహమూర్తి ఆమె పుట్టింటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు.
అనంతరం తాను కూడా గొంతుకోసుకున్నాడు. ఈ దాడిలో అత్త అచ్చాయమ్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని, అత్త అచ్చాయమ్మను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.