ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి పితృ వియోగం
రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తండ్రి అచ్యుతం(82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెలా పదిహేను రోజులుగా బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు భార్య కోట్లమ్మ, నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆయన పెద్దకుమారుడు. అప్పారావు సన్నిహితులు, మిత్రులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద అచ్యుతం భౌతికకాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, నాయకులు నరవ గోపాలకృష్ణ, మేడపాటి అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆదిరెడ్డిని.
ఆయన భార్య, మాజీ మేయర్ వీరరాఘవమ్మను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సీజీసీ సభ్యుడు, జిల్లా పరిశీలకులు మైసూరారెడ్డి, సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఫోన్లో ఆదిరెడ్డిని పరామర్శించారు. కాగా అచ్యుతం అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేటలోని కైలాస భూమిలో శనివారం ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తారు.