ఆక్రోయోగా
ఉరుకులు, పరుగుల జీవితం... ఆదరాబాదరగా ఆహారం... వెరసి యువతపై తీవ్ర దుష్ర్పభావం చూపుతున్నాయి. ఫలితంగా స్థూలకాయంతో అవస్థలు... రోగాలు సాధారణమైపోయాయి. ఇవి శారీరక, మానసికోల్లాసాన్ని దూరం చేస్తున్నాయి. వీటి నుంచి రక్షించే ఏకైక ప్రత్యామ్నాయం యోగా అంటున్నారు నిపుణులు. దీంతో అందానికి అందం, ఆనందానికి ఆనందం. ఈ క్రమంలో యోగాను మరింత ఆసక్తిగా మార్చి యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయ యోగాకు ఆధునికతను జోడించి... సరికొత్త యోగాను పరిచయం చేస్తున్నారు. అలాంటివే ఆక్రోయోగా, ఇన్ యోగా. జంటగా చేసే ఈ యోగాసనాలపై నగరవాసులు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు.
శారీరక, మానసికోల్లాసం కోసం యోగా చేయడం సర్వసాధారణం. యువత కోసం సంప్రదాయ యోగాసనాలకు సరికొత్త రూపం కల్పించిన ఆక్రో యోగా రూపుదిద్దుకుంది. పార్ట్నర్ యోగాకు మరికొన్ని సొబగులు అద్దుకొని మనముందుకు వచ్చిందే ఆక్రోయోగా. ఇద్దరు వ్యక్తులు కలసి ఈ యోగాసనాలు చేస్తుంటారు. కింద ఉన్న వ్యక్తిని బేసర్ అని, పైన ఉన్నవారిని ఫ్లయర్ అని, వీరికి అవసరమున్నప్పుడల్లా సహకారమందించే వారిని సపోర్టర్ అని అంటారు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితులు... ఇలా ఏ ఇద్దరైనా కలసి ఈ యోగాసనాలు చేయవచ్చు. ఇలా జంటగా చేసే యోగాసనాలతో ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు సోమాజిగూడలోని ‘ఎనర్జీయర్ యోగా’ వ్యవస్థాపకుడు కమల్ మలిరమణి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలతో నిత్యం తలమునకలై ఒత్తిడికి గురవుతున్న నగరవాసులకు ఈ సరికొత్త యోగా శారీరక ఉపశమనంతో పాటు మానసికోల్లాసాన్ని అందిస్తుందంటున్నారు.
అనుబంధాన్ని పెంచేలా...
స్నేహితుల మధ్య ఆక్రో యోగా అనుబంధాన్ని పెంచుతోంది. కొన్ని రకాల ఆసనాలు చేయడం చాలా కష్టం. ఒకరికొకరుగా చేసే ఆక్రో యోగాతో శరీరంలోని అవయవాలు తేలిగ్గా కదులుతాయి. కండరాలు పటిష్టం కావడంతోపాటు.. బ్యాలెన్స్డ్గా ఆసనాలు చేయడం వల్ల ఏకాగ్రత, అనుబంధం పెరుగుతోందంటున్నారు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వప్న. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో గడిపి తిరిగి వచ్చాక ఆక్రో యోగా చేయడం వల్ల ఫిట్నెస్తో పాటు ఉల్లాసాన్నిస్తుందంటున్నారు. ఒత్తిడి దూరమై, జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు వీలవుతుందనేది యువత మాట.
ఇన్ యోగాకూ క్రేజ్...
అమెరికాలో పుట్టి పెరిగిన ఇన్ యోగా ఇప్పుడు సిటీలోనూ జోరందుకుంది. మన హఠ యోగాకు దగ్గరగా ఉండే ఈ యోగాను నేర్చుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఒకరే వివిధ భంగిమల్లో ఆసనాలు వేయడం ద్వారా ఒత్తిడి దూరమవుతుంది. డైనమిక్ మూమెంట్స్ వల్ల శరీరంలోని అన్ని అవయవాలూ చురుగ్గా పనిచేస్తాయి. మంచి శక్తి కూడా వస్తుందని అనహిత యోగా జోన్ వ్యవస్థాపకురాలు ప్రతిభా అగర్వాల్ చెబుతున్నారు.
- వాంకె శ్రీనివాస్