19న దేశవ్యాప్త సమ్మె
షోలాపూర్, న్యూస్‌లైన్: దేశ వ్యాప్తంగా నవంబర్ 19న బీడీ కార్మికులు సమ్మెను నిర్వహిస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నర్సయ్య ఆడం పేర్కొన్నారు. స్థానిక కుంబారి ప్రాంతంలో బుధవారం జరిగిన గోదుతాయి మహిళ బీడీ కామ్‌గార్ గృహ నిర్మాణ సంస్థ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీడీ పరిశ్రమ అపాయకరమైనదని పేర్కొంటూ వీటి ఉత్పత్తులపై నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. అందువల్లనే నవంబర్ 19వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా కార్మికులు బతుకు బండిని లాగడం కష్టతరమవుతోందన్నారు.
కార్మికులు ఉపాధి పొందుతున్న పరిశ్రమలను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా కార్మికులు రోడ్డుపైకి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా బీడీ కార్మికుల గృహనిర్మాణానికి లక్షన్నర రూపాయలను గ్రాంటు రూపంలో అందించాలని, బీడీల ఉత్పత్తులపై వ్యాట్‌ను వెంటనే రద్దు చేయాలని, ప్రతి నెలా పింఛన్ కింద రూ.3,000 అందజేయాలనే డిమాండ్లతో ఈ సమ్మెకు దిగుతున్నామన్నారు. ఆ తర్వాత కార్మిక నాయకులు సునంద బల్ల, ఫాతిమా బేగ్, సిద్ధప్ప కలుశెట్టి, కురువయ్య తదితరులు కూడా ప్రసంగించారు.