ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
జీలుగుమిల్లి :రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ జీలుగుమిల్లి ట్రాన్స్‌కో ఏఈ అడపా వెంకటేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంకు చెందిన అలవాల గంగాధర్‌రెడ్డి అనే రైతు తన పొలంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాగా, దానిని ఏర్పాటు చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని ట్రాన్స్‌కో ఏఈ అడపా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
అంత ఇచ్చుకోలేనని రైతు చెప్పడంతో, రూ.8 వేలు ఇవ్వాలని అడిగారు. దీంతో రైతు గంగాధరరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారు. వలపన్నిన ఏసీబీ అధికారులు రైతుకు రూ.8 వేలు ఇచ్చి దర్భగూడెంలోని ట్రాన్స్‌కో కార్యాలయానికి పంపించారు. రైతు గంగాధరరావు ఆ మొత్తాన్ని ఏఈ వెంకటేశ్వరరావుకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేశామని, ఏఈని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ విల్సన్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఏసీబీకి పట్టుబడిన ఏఈ వెంకటేశ్వరరావు తాడేపల్లిగూడెంలో పనిచేస్తూ నాలుగు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చారు.