తెలుగుజాతి ద్రోహులను అడ్డుకుంటాం
హైదరాబాద్: తెలుగుజాతికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీల, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సీమాంధ్రలో పర్యటిస్తే అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పూర్తిగా భాగస్వామ్యులవుతామని చెప్పారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ నెల 5న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో 14 విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు సమావేశమై విద్యార్థి జేఏసీ రాజకీయ ప్రవేశం, 2014 ఎన్నికల్లో విద్యార్థుల భాగస్వామ్యం అంశాలపై చర్చిస్తారన్నారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి రాయపాటి జగదీష్, ఏ.రాజేష్, ఆదిత్యసాయి, వేంకటేశ్వర్రావు, సత్యనారాయణరాజు, కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.