త్రిసభ్య ధర్మాసనానికి బాబ్లీ కేసు
కమిటీలో తెలంగాణకు చోటుపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుపై పర్యవేక్షణకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించిన బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చోటివ్వాలని కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో ఇప్పటివరకు సభ్యులుగా ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు.
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినందున కొత్త రాష్ట్రానికి చోటు ఇవ్వాలని కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన బాబ్లీ ప్రాజెక్టు నిర్మించిన సంగతి తెలిసిందే.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోనే ఎగువన ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి తద్వారా నీటిని కిందికి వదలకుండా అక్రమంగా వాడుకునే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ 2006 నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. అయితే బాబ్లీపై దాఖలైన వ్యాజ్యాలను విచారించిన మీదట సుప్రీంకోర్టు 2013 ఫిబ్రవరి 28న కేసును పరిష్కరిస్తూ ఒక త్రిసభ్య పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
దీనికి సీడబ్ల్యూసీ ప్రతినిధి ఛైర్మన్‌గా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ బాబ్లీ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం 2.74 టీఎంసీల నీటి కంటే ఎక్కువగా వినియోగించుకోకుండా పర్యవేక్షించాలి. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2013 అక్టోబరు 17న కమిటీని ఏర్పాటుచేసింది. విభజన నేపథ్యంలో ఈ కమిటీలో తెలంగాణకు స్థానం కల్పించాలని కేంద్రం వేసిన పిటిషన్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో విచారణకు వచ్చి వాయిదాపడింది.
తాజాగా సోమవారం మరోసారి విచారణకు రాగా.. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ‘బాబ్లీతో ఏపీకి సంబంధం లేదని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు అంటున్నాయి.. అందువల్ల కమిటీలో తెలంగాణకు స్థానం కల్పించండి..’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర తరఫు న్యాయవాది దీనిపై ఏకీభవించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ స్పందిస్తూ ‘బాబ్లీ పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది త్రిసభ్య ధర్మాసనం. అందువల్ల త్రిసభ్య ధర్మాసనానికే నివేదిద్దాం..’ అని ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.