సాహితీలోకంలో విషాదఛాయలు..
ప్రపంచశాంతి పండుగ అవార్డు అందుకున్న రామ్మోహన్రావు
సంతాపం తెలిపిన పలువురు కవులు, సాహితీవేత్తలు
హన్మకొండ కల్చరల్ : వరంగల్ సాహితీ మిత్రుడు అద్దేపల్లి రామ్మోహన్రావు మృతితో జిల్లా సాహితీలోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాకినాడకు చెందిన అద్దేపల్లికి ఆంధ్రదేశమంతటా ఉన్న కవులు, రచయితలు మిత్రులే అయినా వరంగల్ వారితో ప్రత్యేక అనుబంధం ఉండేది. అనేక మార్లు వరంగల్ వచ్చిన ఆయన గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రపంచ శాంతి పండుగ అవార్డు ఇక్కడ స్వీకరించారు. ఆ సందర్భంలో ‘వరంగల్నా రెండో పుట్టిన ఊరు.. మళ్లీ ఇక్కడకు వస్తానో, రానో’ అని పేర్కొన్నారు. గత యూభై ఏళ్లుగా కాళోజీ సోదరులు, కాళోజీ మిత్రమండలితో పాటు అంపశయ్య నవీన్, వరవరరావు, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, నమిలికొండ బాలకిషన్‌రావు తదితరులతో అద్దేపల్లికి అనుబంధం ఉం డగా.. కొత్తరతం కవులను ప్రోత్సహిస్తూ వారు సాహిత్యజీవులుగా స్థిరపడేలా చేశారు. కాగా, అద్దేపల్లి మృతి వార్త తెలుసుకున్న కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాకినాడలో తనను అనేక సాహిత్య సమావేశాలకు ఆహ్వానించే వారని గుర్తు చేసుకున్నారు.
తన అంపశయ్య నవలను 1969లో కాకినాడలో ఆవి ష్కరించారని తెలిపారు. కవి పొట్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రపంచీకరణను ప్రతీ సందర్భంలోనూ వ్యతిరేకించిన కవిగా అద్దేపల్లి రామ్మోహన్రావు గుర్తుండిపోతారని తెలిపారు. అలాగే, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్.విద్యార్థి, సంయుక్త కార్యదర్శి జితేందర్‌రావు, కార్యవర్గసభ్యులు సిరాజుద్దీన్, కేయూ అధ్యాపకులు ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు, పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు తదితరులు కూడా అద్దేపల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.