మొగుడే యముడు
- అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త
బనగానపల్లె రూరల్: అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి భార్యను కడతేర్చాడు. నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని చెరువుపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ మద్దిలేటితో నాలుగు సంవత్సరాల క్రితం కోవెలకుంట్ల చెందిన అరుణ్‌జ్యోతి (22)కి వివాహమైంది. అప్పట్లో కట్నంగా 10 తులాల బంగారం ఇచ్చారు. వీరికి కుమారుడు ఉన్నాడు. ఏడాదిగా మద్దిలేటి అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి చిత్ర హింసలకు గురి చేస్తుండటంతో భరించలేక కొన్నాళ్ల క్రితం ఆమె పుట్టింటికి చేరింది. నాలుగు రోజుల క్రితం కోవెలకుంట్లకు చేరుకుని ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను వెంట తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి మళ్లీ అదనపు కట్నం విషయమై ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆవేశానికి లోనై గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం మద్దిలేటి, అతని తల్లిదండ్రులు బోయ లక్ష్మీదేవి, లక్ష్మన్నఽ పరారయ్యారు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, పాణ్యం సీఐ పార్ధసారథిరెడ్డి, ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, బనగానపల్లె తహసీల్దార్ అనురాధ గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలు తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.