‘నేతాజీ చైనాలో ఉన్నారు!’
కోల్కతా: ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారని, చైనాలోని మంచూరియాలో ఎక్కడో ఉన్నారని నేతాజీ విశ్వసనీయ అనుయాయి దేవ్నాథ్ దాస్ చెబుతున్నారు. దేవ్నాథ్.. నేతాజీ ప్రారంభించిన ఐఎన్ఏ మాజీ నేత. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు’ అన్న సమాచారం ఉన్న పత్రమొకటి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతపర్చిన ఫైళ్లలో ఉంది. 1948, ఆగస్ట్ 9 నాటి ఆ ఫైల్లో దేవ్నాథ్ సహా ఐఎన్ఏ నేతలకు సంబంధించి నిఘావిభాగం సేకరించిన సమాచారం ఉంది.
‘జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను నేతాజీ నిశితంగా గమనిస్తున్నారని, భారత్కు మిత్ర, శత్రుదేశాలేవని అధ్యయనం చేస్తున్నారని దేవ్నాథ్ నేతాజీ అభిమానులతో చెబుతున్నారు’ అని అందులో పేర్కొన్నారు. కాగా, నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాశ్రేయో వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది.