కొలిమేరు బంగారు కొండపై ఆదిమానవుల ఆనవాళ్లు
తునిరూరల్: తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు బంగారు కొండపై ఆదిమానవుల ఆనవాళ్లను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్థానికుడు సిద్ధార్థ వర్మ అందించిన సమాచారం మేరకు రాష్ట్ర పురావస్తుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ శాఖ జిల్లా ఏడీ వెంకటరత్నం, టెక్నికల్ అసిస్టెంట్ తిమ్మరాజు, ఔత్సాహిక పరిశోధకుడు డాక్టర్ మెరపల నారాయణరావులు ఎత్తై బంగారు కొండపైనున్న గుహను సోమవారం పరిశీలించారు.
విశాలమైన గుహలో జంతువు ఆకారం గల రాయిపై అడవి జంతువు బొమ్మలు (రెడ్ ఆక్రే కుడ్య చిత్రాలు), రాతి పనిముట్లను గుర్తించారు. ఇది క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాలకు పూర్వంనాటి శిలాయుగపు గుహ అని ఏడీ తెలిపారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు.