నాకు గాడ్‌ఫాదర్ లేరు.. నేనో ఔట్‌సైడర్‌ని!
ముంబై: బాలీవుడ్లో తానో ఔట్సైడర్ననే భావన కలుగుతున్నదని 'వజీర్' హీరోయిన్ అదితిరావు హైదరి పేర్కొంది. ఇప్పటివరకు 'ఢిల్లీ 6', 'యే సాలి హై జిందగి', 'రాక్‌స్టార్' వంటి సినిమాల్లో నటించిన అతిది రావు తాను హిందీ చిత్రసీమలో చాలా విషయాల్లో ఇమడలేకపోతున్నానని తెలిపింది.
'కొన్ని విషయాల్లో నేను ఔట్సైడర్నేమోనన్న భావన కలుగుతోంది. ఉదాహరణకు సోషల్ మీడియాలో చాలామంది మద్దతు వ్యవస్థ ఉంది. కానీ నాకు లేదు. నేను ఏదైనా సోషల్ మీడియాలో పెడితే కొందరే మద్దతు తెలుపుతారు. అది సహజంగా వచ్చింది కాబట్టి నాకు ఆనందం కలిగిస్తుంది. కానీ చాలామందికి వాళ్ల స్నేహితులు, కజిన్స్, ఆంకుళ్లు, ఆంటీలు ఇలా అందరూ ముందుకొస్తుంటారు. అంతేకాకుండా వాళ్లు తమకు తెలిసినవాళ్లకు మెసేజ్‌లు పెట్టి మరీ కామెంట్లు, మద్దతు సంపాదించుకుంటారు. కానీ నేను అవన్ని పట్టించుకోను. ఇలాంటి విషయాలు గొప్పవేం కాకపోయిన ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇమేజ్ కోసం అలా చేయడం ముఖ్యమని చాలామంది భావిస్తున్నారు' అని అదితి వివరించింది.
తనకు సినిమా పరిశ్రమలో మద్దతుగా గాడ్ఫాదర్లు ఎవరూ లేరని ఆమె పేర్కొంది. 'నాకు మద్దతుగా పెద్ద నిర్మాణ సంస్థగానీ, దర్శకుడుగానీ, హీరోగానీ లేరు. నేను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. బయటి ప్రపంచం నుంచి వచ్చిన నాకు చిత్రపరిశ్రమలో ఎవరూ తెలిసిన వారు లేరు. ఇతరుల కంటే నేను ముందు అని చెప్పుకోవాలని గానీ, ఇతరులకు వెన్నుపోటు పొడవాలనిగానీ నాకు ఎలాంటి ఆలోచన లేదు. ప్రతిరోజూ సంఘర్షణే నాకు. నా నచ్చిన సినిమాలు చేయడానికి ఈ రోజువరకు నేను పోరాడుతూనే ఉన్నాను' అని అదితి తెలిపింది.