సిద్ధమైన పరిపాలనా నగరం డిజైన్లు
నేడు ప్రభుత్వానికి తుది డిజైన్లు సమర్పించనున్న నార్మన్ ఫోస్టర్ సంస్థ
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరం డిజైన్లు సిద్ధమయ్యాయి. విడతల వారీగా ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా తుది డిజైన్లు రూపొందించిన లండన్‌కు చెందిన మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమైంది. మార్పులు చేసిన హైకోర్టు భవనం డిజైన్లను ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు చూపించింది. ఆయనకు నచ్చితే దాన్నే ఖరారు చేయనున్నారు.
వాటితోపాటు మిగిలిన అసెంబ్లీ, సచివాలయం ఇతర భవనాల డిజైన్లను బుధవారం ముఖ్యమంత్రికి చూపించనున్నారు. అసెంబ్లీ భవనాన్ని కోహినూర్ వజ్రం ఆకృతిలో రూపొందించాలని గతంలో చంద్రబాబు సూచించడంతో ఆ మేరకు దాన్ని మార్చారు. మార్పులతో కూడిన ఈ తుది డిజైన్లనే ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. 1,350 ఎకరాల్లో నిర్మించనున్న పరిపాలనా నగరాన్ని ఆరు బ్లాకులుగా విభజించి డిజైన్లు రూపొందించారు. పూర్తిస్థాయిలో రూపొందించిన ఈ డిజైన్లను ఆమోదించి విజయదశమి రోజు పరిపాలనా నగరానికి మరోసారి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.