క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు
నిబంధనల ప్రకారమే నిర్ణయాలు
జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ వెల్లడి
జిల్లా పరిషత్ : పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల పోస్టింగ్‌లను మార్చామని జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ చెప్పారు. క్యాంపు కార్యాలయం అధికార నివాసమేనని స్పష్టం చేశారు. ‘ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు, బదిలీ’ శీర్షికతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై జెడ్పీ చైర్పర్సన్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు లేఖ అందజేశారు. అందులోని వివరాలు ఆమె మాటల్లోనే..
పరిపాలన వ్యవహారాలలో భాగంగా జెడ్పీ కార్యాలయంలోని జిల్లా పరిషత్ ఫైళ్లు సంబంధిత సెక్షన్ ఇన్చార్జ్, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, డిప్యూటీ సీఈఓ, సీఈఓ పరిశీలించిన తర్వాతే చైర్పర్సన్ ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయానికి వస్తాయి.
ఆ తర్వాత నిబంధనలకు లోబడి ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జెడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయం అధికార నివాసమేనని, నాతో మాట్లాడడానికి వచ్చే అధికారులను రిసీవ్ చేసుకోవటం, మాట్లాడటానికి సమయం కల్పించడం సీసీగా ఉన్న ఉద్యోగి విధి. ఉద్యోగ ధర్మంలో భాగంగా ఏ ఉద్యోగి అయిన వారి సెక్షన్‌కు సంబంధించిన ఫైళ్ల వివరణ గూర్చి క్యాంపు కార్యాలయాలనికి వచ్చి వివరణ ఇస్తున్నారు.
తొమ్మిది నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై ఆరు నెలల్లో విచారణ నిర్వహించకపోతే నిబంధనల ప్రకారం షరతులతో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సదరు ఉద్యోగి దరఖాస్తు పెట్టుకున్నందునే ఫైల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. నేను జిల్లా పరిషత్ పదవికి కొత్త. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమైనా.. నిబంధనల ప్రకారం, ఉద్యోగుల భవిష్యత్ మేరకు వ్యవహరిస్తాను అని ఆ లేఖలో పేర్కొన్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తనను నియోజకవర్గంలో పని చేయవద్దని, సెలవుపై వెళ్లాలని ఆదేశించారని పేర్కొంటూ గీసుకొండ ఎంపీడీఓ పారిజాతం బదిలీ చేయాలని కోరారు. పారిజాతం ఇదే నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉంది. దీంతో దుగ్గొండి ఎంపీడీఓగా డిప్యూటేషన్‌పై పోస్టింగ్ ఇచ్చాము. ఆత్మకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాధ్యతలను కేసముద్రం ఎంపీడీఓకు అదనంగా అప్పగించామని వివరించారు.