తహసీల్దార్ల బదిలీలపై కసరత్తు
- ఖాళీగా ఉన్నవాటితో సహా...
- పలు మండలాలకు కొత్త ముఖాలు
- పనితీరు ప్రామాణికంగా మార్పులు చేర్పులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పాలనాపరమైన బదిలీల్లో భాగంగా పలువురికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించింది. జిల్లా పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం బదిలీల జోలికి వెళ్లని కలెక్టర్/జాయింట్ కలెక్టర్లు... ఇప్పుడిప్పుడే తహసీల్దార్ల పనితీరుపై ఒక స్పష్టతకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బదిలీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సమర్థత, పనితీరు గీటురాయిగా మార్పులు చేర్పులు జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఇబ్రహీంపట్నం, పరిగి మండలాలకు కొత్త తహసీల్దార్లను నియమించిన కలెక్టర్... జిల్లాకు కేటాయించిన మరొకరికి కలెక్టరేట్లో పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరికొందరికి స్థానచలనం కలిగించాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శామీర్‌పేట, యాచారం, మల్కాజిగిరి, మొయినాబాద్ తదితర మండలాల తహసీల్దార్లకు స్థానభ్రంశం కలిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనికితోడు ఖాళీగా ఉన్న యాలాల, కలెక్టరేట్లో ఖాళీగా ఉన్న ఏఓ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇవేకాకుండా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న పూడూరు తహసీల్దార్ స్థానంలో కూడా మరొకరిని నియమించాల్సివుంది. ఈ నెల 20న పలువురు డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు లభించే అవకాశమున్నందున... వీటిని కూడా బదిలీల్లో పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లింలకు నూతన వస్త్రాల పంపిణీలో యంత్రాంగం బిజీగా ఉన్నందున.. పండగ అనంతరమే బదిలీల కూర్పు కొలిక్కి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.