12 రోజుల పాపనూ వదల్లేదు !
♦ నయీమ్ ముఠా చెంతకు పెద్దవూర చిన్నారి
♦ పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠా అమాయక గిరిజనుల బల హీనతలను కూడా సొమ్ము చేసుకుందని తెలుస్తోంది. గిరిజన కుటుంబాల్లో శిశు విక్రయాలు ఉంటాయనే ఆలోచనతో దానిపై దృష్టి సారించిన నయీమ్ 12 రోజుల పసిపాపను కూడా కొనుక్కుని తీసుకెళ్లాడనే విషయం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పెదవూర మండ లం ఏనెమీది గూడేనికి చెందిన గిరిజన దంపతులకు జూన్ 3వ తేదీన హాలి యాలోని ఓ ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మించింది. డిశ్చార్జి అయిన రెండు రోజులకే త్రిపురారం, వేములపల్లి మండలాలకు చెందిన ఆర్ఎంపీలు రఫీ, రమేశ్‌లు ఆ దంపతుల దగ్గరకు వెళ్లి పాపను నయీమ్ బంధువు సుల్తానా బేగంకు అమ్మాలని ఒప్పించారు.
ఇందుకోసం వారికి రూ.30 వేలు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ విషయం పోలీసు విచారణలో వెల్లడైన వెంటనే గురువారం రాత్రి సిట్ బృందం హాలియాలోని ఆస్పత్రికి వచ్చి ఆ పాప డిశ్చార్జి షీట్‌ను తీసుకెళ్లినట్టు సమాచా రం. ఇద్దరు ఆర్ఎంపీలను కూడా సిట్ అదుపులోనికి తీసుకుని విచారిస్తోందని తెలిసింది. ఇప్పటికే తమ అదుపుల్లో ఉన్న నయీమ్ అత్త సుల్తానా, బావమరిది సాదిక్, ఆయన భార్య ఫర్జానాలను మిర్యాలగూడలో విచారించి పలు కీలక అంశాలపై సమాచారం రాబ ట్టింది. బ్యాంకు లాకర్లలో 28 తులాల బంగారం, 70 తులాల వెండితోపాటు రూ.1.50 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని సీఐ తెలిపారు.