పత్తి విత్తన మాయ..!
- విత్తనోత్పత్తి కంపెనీల ముసుగుతో భారీగా రాయల్టీ ఎగవేత
- రెండు నెలల్లో రూ.20 కోట్ల విలువ గల పత్తి విత్తనాల విక్రయాలు
సాక్షి, మహబూబ్‌నగర్: పత్తి విత్తనోత్పత్తి కంపెనీల ముసుగులో కొందరు అక్రమార్కులు మాయ చేస్తున్నారు. అమాయక రైతులను ఆసరా చేసుకొని కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు. విత్తన ఉత్పత్తి కంపెనీల వద్ద వ్యవసాయా«ధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సీడ్స్ జిన్నింగ్ సమయంలో నాన్‌సీడ్ పత్తి విత్తనాల్ని సైతం జిన్నింగ్ చేసి కలుపుతున్నారు. అలాగే కంపెనీల ముసుగులో ప్రభుత్వానికి భారీగా రాయల్టీ ఎగవేస్తున్నారు. దీంతో తక్కువ ధరకే ‘కంపెనీ’విత్తనాలు లభిస్తున్నాయనే ఆశతో రైతులు మోసపోతున్నారు.
ఈ నేపథ్యంలో పత్తి రైతులు కంపెనీల వద్ద తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు ప్రాంతంతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన రైతులు భారీగా వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ మే, జూన్ రెండు నెలల్లోనే దాదాపు రూ.20 కోట్ల మేర అమ్మకాలు జరిపినట్లు సమాచారం. ఒక ప్యాకెట్‌ను దాదాపు 450 గ్రాముల విత్తనాల తో తయారు చేస్తున్నారు. ఒక ప్యాకెట్ విత్తనాలలో నాన్‌సీడ్ విత్తనాలు దాదాపు 50 నుంచి 100 గ్రాములు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.
రాయల్టీ ముసుగులో విత్తనాల విక్రయాలు
కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన పెద్ద కంపెనీల నుంచి కొన్ని చిన్న కంపెనీలు విత్తనోత్పత్తి కోసం అగ్రిమెంట్ చేసుకుం టున్నాయి. అందుకోసం రాయల్టీ రుసుము కింద ఒక్కొక్క ప్యాకెట్‌కు గాను రూ.100 నుంచి 250 వరకు చెల్లిస్తున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం విక్రయించాల్సి ఉండగా... చిన్న కంపెనీలు అంతకు మించి వేలాది పత్తి విత్తనాల ప్యాకెట్లను అమ్ముతున్నాయి. ఎవరైనా అధికారులు దాడులు చేస్తే కొంత మొత్తానికి తీసుకున్న అనుమతి పత్రాలే చూపుతుంటారు. ఇలా ప్రతి కంపెనీకి చెందిన దుకాణాలు అగ్రిమెంట్ అధికంగా పత్తి విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకుం టున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది.