క్రిప్టోకరెన్సీ ప్రకటనలకు గూగుల్ షాక్
సెర్చింజిన్ దిగ్గజం ఆల్ఫాబెట్ గూగుల్, క్రిప్టోకరెన్సీ ప్రకటనలకు షాకిచ్చింది. క్రిప్టోకరెన్సీలను ప్రమోట్ చేసే ఆన్లైన్ ప్రకటనలు, సంబంధిత కంటెంట్‌పై జూన్ నుంచి నిషేధం విధిస్తున్నట్టు గూగుల్ పేర్కొంది. బుధవారం గూగుల్ తన పాలసీని అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ఈ కొత్త పాలసీ కింద చట్టవిరుద్దమైన లేదా ఊహాజనితమైన ఫైనాన్సియల్ ప్రొడక్ట్‌లపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఇదే రకమైన నిర్ణయాన్ని కూడా ఫేస్బుక్ జనవరిలోనే తీసుకుంది. ఫేస్బుక్, ఆడియన్స్ నెట్వర్క్, ఇన్స్టాగ్రామ్ వంటి తన ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పాలసీనే అమల్లోకి తేనున్నట్టు ఫేస్బుక్ తెలిపింది.
2017లో 3.2 బిలియన్ ప్రకటనలు తమ వ్యాపార ప్రకటన పాలసీలను ఉల్లంఘించాయని, 2016లో సుమారు రెండింతల ప్రకటనలను తొలగించినట్టు గూగుల్ మరో బ్లాగ్ పోస్టులో పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటనల అనుభవాన్ని మెరుగు పరచడానికి, హాని కలిగించే ప్రకటలను తొలగిస్తున్నామని తెలిపింది. కాగ, ప్రస్తుతం బిట్‌కాయిన్, మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది.