‘మిషన్ కాకతీయ’కు మచ్చ
నిండుగా నీళ్లున్న చెరువుకు టెండర్
చెరువు ఖాళీచేసి
పని చేయించడానికి నిర్ణయాలు
జూరాల : రాజుల కాలం నాటి నుంచి నేటి వరకు ఆదరణకు నోచుకోని చెరువులు, కుంటలను పునరుద్ధరించి పల్లెప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలన్న మంచి ఆశయంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టింది. కానీ అధికారులు తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్లుగా నిరంతరంగా నీటి నిల్వ ఉన్న ఉప్పేరు పెద్ద చెరువును మిషన్ కాకతీయలో చేర్చి పనులు చేయిస్తామంటూ టెండర్లకు పిలిచారు. ప్రజలు, ఆయకట్టు రైతులు నీళ్లున్న చెరువులో పనులు ఎలా చేస్తారనే సందేహం వ్యక్తం చేస్తున్నా అధికారులకు అవేమీ పట్టలేదు. కేవలం 50 ఎకరాలకు మించి ఆయకట్టు లేని ఉప్పేరు పెద్ద చెరువును నీళ్లున్నప్పటికీ * 22లక్షల వ్యయంతో అధికారులు బాగు చేస్తాంమంటున్నారు.
గద్వాల నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2012లో మొదటి, రెండో పంప్‌హౌస్‌లు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి మొదటి పంప్‌హౌస్ వద్ద ఉన్న గుడ్డెందొడ్డి ఆన్లైన్ రిజర్వాయర్ ఏనాడూ నీళ్లు లేని స్థితికి రాలేదు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌కు దిగువన ఉన్న ఉప్పేరు పెద్ద చెరువుకు సీపేజీ నిరంతరంగా కొనసాగుతుంది. దీంతో మూడేళ్లుగా ఈ చెరువు జలకళతో ఉంది. ఉప్పేరు పెద్ద చెరువు పరిధిలో వాస్తవానికి 200 ఎకరాల ఆయకట్టు ఉండగా, జూరాల రిజర్వాయర్ దాదాపు 150 ఎకరాలు ముంపునకు గురయ్యాయి.
మిగతా 10 నుంచి 15 ఎకరాల్లో జమ్ము పెరిగి పంటలు సాగు చేయడానికి వీలులేకుండా మారింది. మిగిలిన కొద్దిపాటి 30 నుంచి 40 ఎకరాల ఆయకట్టు మాత్రమే రైతులకు అందుబాటులో ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న ఉప్పేరు పెద్ద చెరువును అధికారులు ముందుచూపులేకుండా మిషన్ కాకతీయలో చేర్చారు. * 22లక్షల వ్యయంతో చెరువు కట్టను బలోపేతం చేయడంతో పాటు చెరువులో ఒండ్రుమట్టిని తొలగించేందుకు నిర్ణయించారు. రైతులు అభ్యంతరం తెలిపినా అధికారులు టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. నీళ్లున్న ఉప్పేరు పెద్ద చెరువులో పనులెలా చేస్తారో ప్రజలకు అర్థం కాకపోయినా అధికారులు మాత్రం నీళ్లు తీయించి పనులు చేస్తామంటున్నారు. దీంతో ప్రజలు అధికారుల తీరును విమర్శిస్తున్నారు.
ఈ విషయమై ధరూరు చిన్ననీటి పారుదల ఏఈ లక్ష్మినారాయణను వివరణ కోరగా చెరువు నీటిని విడుదల చేసి నీళ్లు తగ్గిన ప్రాంతంలో పనులు చేయిస్తామని, అలాగే కట్టకు కూడా మరమ్మతులు పనిచేస్తామని తెలిపారు.