టీఆర్ఎస్ కౌన్సిలర్‌పై హత్యాయత్నం
- ఆస్పత్రిలో బాధిత కౌన్సిలర్‌కు పరామర్శల వెల్లువ
- పట్టణ బంద్ ప్రశాంతం
సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి పట్టణంలోని 20 వార్డు కౌన్సిలర్ ప్రదీప్‌పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన హత్యాయత్నంపై గల కారణం ఏమిటన్నది పోలీసులకు అంతుబట్టడం లేదు. నవంబర్ 29న జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ప్రదీప్‌పై ఎంఐఎం కౌన్సిలర్లు తిరగ బడ్డారని వారే దీనికి పాల్పడినట్లు మొదట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత అదే సమావేశంలో ఎర్రకుంట శిఖం భూమిపై ప్రదీప్ ప్రస్తావించడంతోనే భూకబ్జాదారులు దాడికి పాల్పడినట్లు అనుమానం వచ్చింది. కాగా బాబానగర్ ప్లాట్లు విక్రయాల విషయంలో సైతం ప్రదీప్, అతడి మిత్రుడు శ్రీకాంత్‌లు అక్కడి కాలనీవాసులతో గొడవకు దిగారని అందువల్లే ఈ దాడి జరిగిందనే మరో ప్రచారం సాగింది. కానీ ఈ దాడికి ప్రధాన కారణం తెలియడం లేదు.
ఇదిఇలా ఉంటే ప్రదీప్ కల్వకుంటలో ఉన్న ఆయన ఇంటికి వె ళ్లేందుకు సుహానాదాబా నుంచి బైపాస్ మీదుగా రావచ్చు. లేదంటే ప్రధాన రహదారి మీదుగా వచ్చే అవకాశం ఉంది కాని ఎప్పడూ లేని విధంగా రాజంపేట రోడ్డు మీదుగా ఎందుకు వచ్చారనే ప్రశ్నకు సమాధానం లేదు. దాబా వద్దనే ఎవ్వరికి వారు వెళ్లినా.. శ్రీధర్‌రెడ్డి అక్కడే ఎందుకు ఉన్నాడు..? ఆయన వాహనంలో పెట్రోల్ అయిపోయిన విషయం ఎప్పడు తెలిసింది..? ఆ రాత్రి ఆయన ఊరి నుంచి పెట్రోల్ ఎవ్వరు తీసుకోస్తారంటే అక్కడే నిలిచిపోయారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సంఘటన విషయం తెలియగానే తాను సమాచారం ఇవ్వడంతో శ్రీధర్‌రెడ్డి వచ్చినట్లు శ్రీకాంత్ తెలుపడాన్ని సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ప్రదీప్‌పై జరిగిన దాడికి ప్రధాన కారణం తెలియలేకపోతుంది. ఇందుకు ఎర్రకుంట భూ కబ్జాదారులు చేశారా.? ఎంఐఎం కౌన్సిలర్లు చేశారా..? ఆయన అనుచరులే చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
పరామర్శల వెల్లువ : గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కత్తి పోట్లకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌన్సిలర్ ప్రదీప్‌ను జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హుగ్గెల్లీ రాములుతో పాటు పలువురు పరామర్శించారు. సంగారెడ్డి ఇన్చార్జ్ కమిషనర్ గయజుద్దీన్, మున్సిపల్ సిబ్బంది సైతం ప్రదీప్‌ను పరామర్శించారు.
పట్టణం బంద్ : కౌన్సిలర్‌పై దాడికి నిరసనగా తెలంగాణ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు రాజేందర్‌నాయక్, కొత్తపల్లి నాని, జయపాల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేశాయి. వ్యాపార సంస్థలను బంద్ చేయించే క్రమంలో ఇండియన్ పెట్రోల్ బంక్ యజమాని బంద్‌కు నిరాకరించడంతో నాయకులు ఆయనతో వివాదానికి దిగారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు