తదుపరి విచారణ వరకు కూల్చబోం
► సచివాలయ భవనాలపై హైకోర్టుకు ప్రభుత్వం హామీ
► వాస్తు వల్లే కూల్చేస్తున్నామన్నది అవాస్తవమన్న ఏజీ
► తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వలేమన్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాలను తదుపరి విచారణ వరకు కూల్చబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. వాస్తు కారణంగా సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. అగ్నిప్రమాద నివారణ సౌకర్యాలు లేకపోవడం, భద్రతాపరమైన లోపాలు, తగి నంత పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తది తర కారణాలవల్లే సచివాలయం కూల్చి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయించామంది. కూల్చివేత విషయంలో ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో సచివాలయ తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసేందు కు నిరాకరించింది.
సచివాలయం తరలింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, కనుక ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు కు పది రోజుల గడువునిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మేమెలా జోక్యం చేసుకుంటాం?
సచివాలయం విషయంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఫలానా భవనం అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని తాము ఇక్కడ (కోర్టులో) కూర్చొని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. ఇందుకు సత్యంరెడ్డి స్పందిస్తూ..
‘వాళ్లు అక్కడ (సచివాలయంలో) కూర్చొని చెబుతున్నప్పుడు మీరు (న్యాయమూర్తులు) ఇక్కడ కూర్చొని చెప్పడంలో తప్పులేదు’ అన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తోందన్నారు. అయితే తమకు సచివాలయం తరలింపుతో ఎంత మాత్రం సంబంధం లేదని, కేవలం భవనాల కూల్చివేతపైనే విచారణ చేపడుతామని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ప్రస్తుత భవనాలు అత్యంత పురాతనమైనవన్నారు. అగ్నిప్రమాద నివారణ సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని, అలాగే భద్రతాపరంగా పలు లోపాలున్నాయని, పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు లేవని వీటన్నింటి కారణంతోనే ప్రస్తుత భవనాలను కూల్చి, కొత్త వాటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. వాస్తు కారణంతో భవనాలను కూల్చేస్తున్నామనడం ఎంత మాత్రం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సచివాలయంలోని తమకు కేటాయించిన భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిందా? అని ప్రశ్నించింది.
అప్పగింతపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నట్లు లేదని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘సచివాలయ భవనాలను రేపే కూల్చేస్తున్నారని పిటిషనర్లు చెబుతున్నారు. ఇది నిజమేనా?’ అని అడిగింది. ఇందుకు ఓ పది రోజుల పాటు కూల్చివేతలు చేపట్టబోమని ఆయన బదులిచ్చారు.
హేతుబద్ధత ఉండాలి
సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్‌కు చెందిన తేరా రజనీకాంత్‌రెడ్డి వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సచివాలయ భవనాలు పటిష్టంగా ఉన్నాయని, కొన్నింటిని ఇటీవలే నిర్మించారని, అయినా వాటన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు వాస్తును ప్రధాన కారణంగా చెబుతున్నారని, దీనిపై పత్రికల్లో విస్తృతంగా కథనాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో సహేతుకత, హేతుబద్ధత ఉండాలన్నారు.
రంగులు పులమొద్దు
కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి స్పందిస్తూ.. సచివాలయ భవనాలను ఇవ్వరాదని ఏపీ నిర్ణయించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఏపీ మంచి నిర్ణయమే తీసుకుందని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మాసనం అడ్డుతగులుతూ.. ఈ వ్యవహారానికి ఎలాంటి రంగులూ పులమవద్దని హితవు పలికింది. వ్యక్తుల గురించి మాట్లాడాలంటే అందుకు కోర్టులను వేదిక చేసుకోవద్దని స్పష్టం చేసింది.
మేం చేసేదీ ప్రజా ప్రయోజనాల కోసమే...
ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకోవడానికి సచివాలయం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ప్రజల ఆస్తి అని సత్యంరెడ్డి వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. ఏపీ తన సచివాల యాన్ని అమరావతికి మార్చుకుంది. అక్కడికి వెళ్లే లోపు ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. ఇవన్నీ తప్పవు. కూల్చివేతలు గానీ, తరలింపు గానీ చట్ట విరుద్ధమని చెప్పండి. ఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుం దో చూపండి. మేం జోక్యం చేసుకుంటాం’ అని స్పష్టం చేసింది.
సచివాలయ కొత్త భవనాల నిర్మాణం కూడా ప్రజా ప్రయోజనాల్లో భాగమేనని ఏజీ చెప్పారు. ఈ సమయంలో సచివాలయం తరలింపును నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సత్యంరెడ్డి కోరినా ధర్మాసనం నిరాకరించింది. కూల్చివేతలపై ధర్మాసనం స్పష్టత కోరగా.. తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఉండబోమని ఏజీ హామీ ఇచ్చారు. దీనిపై పది రోజుల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.