ఎన్‌కౌంటర్‌పై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు
తమిళులు.. తెలుగువారి మధ్య 'ఎన్కౌంటర్' చిచ్చు
హెరిటేజ్ స్టోర్స్‌పై దాడులు.. పగిలిన అద్దాలు
మైలాపూర్‌లో రైలురోకో.. ఏపీ రైళ్లను ఆపేసిన ఆందోళనకారులు
హైకోర్టు ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
కంటిమీద కునుకు లేని తెలుగువారు
చెన్నై: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీప్రాంతంలో 20 మంది ఎన్కౌంటర్ తమిళనాడులోని తెలుగువారు, తమిళుల మధ్య చిచ్చురేపింది. ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలు గురువారం నాడు స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాంతో వాటిని చూసిన బంధువులు, ఆయా గ్రామస్థులు మరింత ఆగ్రహావేశాలకు గురయ్యారు. రైలు రోకోలు చేసి, చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లన్నింటినీ ఆపేశారు. హైకోర్టు ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మృతదేహాలకు తిరిగి పోస్టు మార్టం చేయించాలని వారి బంధువులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందినవారు కాకుండా వేరేవాళ్లు పంచనామా చేయాలన్నారు.
మరోవైపు తమిళనాడులో ఉన్న హెరిటేజ్ స్టోర్ల మీద దాడులు ఎక్కువయ్యాయి. అక్కడ ఎవరూ ఎలాంటి కొనుగోళ్లు చేయద్దంటూ అల్టిమేటం జారీచేశారు. మైలాపూర్ ప్రాంతంలో ఉన్న దుకాణంలోకి వెళ్లి అద్దాలు పగలగొట్టారు. లోపలున్న సరుకులు, కూరగాయలను బయటకు విసిరేశారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ ఆందోళనల కారణంగా తమిళనాడులో ఉన్న తెలుగువాళ్లకు కంటిమీద కునుకు లేని పరిస్థితి ఏర్పడింది.