Agneepath
-
విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అగ్నివీర్ తొలి రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖలో ప్రారంభమైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు యానాం అభ్యర్థులకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. శనివారం అర్థరాత్రి నుంచే ర్యాలీ మొదలైంది. అభ్యర్థులను ఆన్లైన్లో జారీ చేసిన అడ్మిట్ కార్డుల ఆధారంగా మైదానంలోకి పంపించారు. బ్యాచ్‌లుగా విభజించి.. ఎత్తు, బరువు, ఇతర అంశాల్ని పరిశీలించారు. లాంగ్ జంప్, హైజంప్, పరుగు పందెం, ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించారు. ఎంపికైన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించారు. తదుపరి విడత అభ్యర్థులను ఆదివారం అర్థరాత్రి 12 గంటల నుంచి మైదానంలోకి అనుమతించారు. ఈ నెల 31 వరకు ఈ రిక్రూట్మెంట్ కొనసాగుతుంది. -
విశాఖలో అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ర్యాలీ
-
అది ప్రధాని మోదీ ల్యాబ్‌లో చేసిన కొత్త ప్రయోగం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై మరోమారు ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాబ్‌లో చేస్తున్న ఆ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రతి ఏడాది 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చెందితే.., అందులో కేవలం 3వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘ప్రతి ఏటా 60వేల మంది జవాన్లు రిటైర్ అవుతున్నారు. అందులో 3వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. నాలుగేళ్ల కాంట్రాక్ట్ తర్వాత రిటైర్ అయ్యే వేలాది మంది అగ్నివీర్ల భవిష్యత్తు ఏమిటి? ప్రధానమంత్రి ల్యాబోరేటరీలో చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రతా, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయి.’ అని రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. 60,000 सैनिक हर साल रिटायर होते हैं, उनमें से सिर्फ 3000 को सरकारी नौकरी मिल रही है। 4 साल के ठेके पर हज़ारों की संख्या में रिटायर होने वाले अग्निवीरों का भविष्य क्या होगा? प्रधानमंत्री की प्रयोगशाला के इस नए Experiment से देश की सुरक्षा और युवाओं का भविष्य दोनों खतरे में हैं। — Rahul Gandhi (@RahulGandhi) July 24, 2022 అగ్నిపథ్ పథకం ద్వారా త్రివిధ దళాల్లోకి అగ్నివీర్లను నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిన 17-21 ఏళ్ల అవివాహిత యువతను నియమిస్తామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత అందులోని 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. సికింద్రబాద్ సహా పలు చోట్ల రైళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఈ క్రమంలో వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది కేంద్రం. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్ -
అగ్నిపథ్ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకు
న్యూఢిల్లీ: సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ తన ముందు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులు కూడా తమ వద్ద దాఖలైన పిల్స్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిన నేపథ్యంలో అగ్నిపథ్‌పై వివాదం సుప్రీంకోర్టును తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు.. ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదీ చదవండి: Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం? -
Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం?
న్యూఢిల్లీ: అగ్నిపథ్ నియామకాలకు సైన్యం కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటోందన్న వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను సైన్యం కులం, మతం సర్టిఫికెట్ అడుగుతోందని విపక్షాలు మంగళవారం ఆరోపించాయి. అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కూడా వాటితో గొంతు కలిపింది. వీటిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించగా, సైన్యం వద్ద ఇలాంటి సమాచారముంటే సైనికుల అంత్యక్రియల వంటి సమయంలో సహాయకారిగా ఉంటుందంటూ అధికార బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించడం విశేషం! అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిని కులం, మతం సర్టిఫికెట్లు జతపరచాలని అడుగుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్‌సింగ్‌తో పాటు అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఆరోపించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కులమతాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ట్వీట్ చేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు సైన్యంలో చేరేందుకు అనర్హులని ప్రధాని మోదీ భావిస్తున్నారా అని సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం.. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. సైన్యంలో స్వాంతంత్య్రానికి ముందునుంచీ వస్తున్న నియామక పద్ధతులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. సైన్యంపై వివాదాలు పుట్టించే ప్రయత్నాలు విపక్షాలకు పరిపాటేనన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ కేజ్రివాల్ అనుమానించడాన్ని గుర్తు చేశారు. నియామకాల్లో కులమతాలను ఏ విధంగానూ పరిగణనలోకి తీసుకోవడం జరగదంటూ 2013లో యూపీలో హయాంలో సుప్రీంకోర్టులో సైన్యం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదీ చదవండి: IAF Agnipath Recruitment 2022: భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ -
గాంధీ సినిమా దర్శకుడుతో పనిచేయడమే అద్భుతం
ముంబై: గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు. ‘కస్తూరీ బా పాత్ర నాకు ఎలా వచ్చిందో లీలగా గుర్తుంది. మరాఠీ నాటకాల్లో నటిస్తున్న సమయంలో డాలీ ఠాకూర్ అనే ఏజెంట్ వచ్చి రిచర్డ్ సార్‌ను కలవాలని చెప్పింది. ఆయన ఢిల్లీ మీదుగా లండన్ వెళ్తూ ముంబైలో ఆగారు. నేను కూడా ఆ రోజు ముంబైలోనే ఉండడంతో గంటసేపు మాట్లాడగలిగాను. తెల్లవారి డాలీ ఫోన్ చేసి నాకు కస్తూరి పాత్ర దక్కిందని చెప్పింది. డాలీ సాయంతో ఎలాగొలా పాస్‌పోర్టు సంపాదించి లండన్ వెళ్లాను’ అని వివరించారు. రిచర్డ్ గాంధీ సినిమా నటులందరికీ స్క్రిప్టు ప్రతులు ఇచ్చి హోంవర్క్ చేయాలని సూచించేవారు. దీంతో రోహిణి కస్తూరీ బాపై వచ్చిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేశారు. యాస లేకుండా ఇంగ్లిష్ మాట్లాడాలని సూచించడంతో ఈమె ప్రత్యేకంగా వక్తృత్వ తరగతులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అంతేగాక చరఖా వడకడం నేర్చుకోవాలని గాంధీ పాత్రధారి బెన్ కింగ్స్లేతోపాటు తనకూ సూచించారని రోహిణి చెప్పారు. 1982లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రెండు ఆస్కార్ అవార్డులు అందుకుంది. ‘అప్పుడు నా వయసు చాలా చిన్నది కాబట్టి కస్తూరి పాత్ర ప్రాధాన్యం సరిగ్గా అర్థం కాలేదు. కేవలం పాత్రలాగే భావించి చేస్తూపోయాను. తదనంతరం ఈ సినిమా ప్రచారం కోసం ఎన్నో దేశాలు తిరిగి తరువాత ఈ పాత్ర గొప్పదనం ఏంటో అర్థమయింది. నటన విషయంలో రిచర్డ్ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు’ అని వివరించారు.