‘మహా’ ఒప్పందంతో సస్యశ్యామలం
సిద్దిపేటలో సంబరాలు
కేసీఆర్, హరీశ్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం
సిద్దిపేట రూరల్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటి విషయమై ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మకమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మహా ఒప్పందంపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తుపాకులు బాల్‌రంగం, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీర్ సర్కారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రం పచ్చటి తెలంగాణగా మారబోతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాగునీటి అవశ్యకతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టాలను తీర్చేందుకు ఒప్పందం చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర సమస్యలపై వివక్షత చూపాయన్నారు. ఈ ప్రభుత్వం మహారాష్ట్ర తో తుమ్మిడిహట్టి బ్యారేజీ నుంచి 160 టీఎంసీల నీరు తీసుకెళ్లాడానికి ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
రాబోయే రోజుల్లో రాష్టంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు మండల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు మండల పరిషత్ కార్యాలయం ముందు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఒప్పందాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు స్వాగతం పలికేందుకు సిద్దిపేట నుంచి భారీగా తరలి వెళుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు గ్యార యాదగిరి, సిద్దరబోయిన శ్రీనివాస్, ఎల్లారెడ్డి, బరిగెల నర్సింలు, యెదుల్ల నర్సింలు , పడిగె నారాయణ తదితరులు పాల్గొన్నారు.