చిన్నారి అదృశ్యం
రెండు గంటల్లోపే తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఖాజీపేట : ఖాజీపేటలో ఓ చిన్నారి అదృశ్యం కాగా పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు గంటల్లోపే చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఖాజీపేట బస్టాండు కూడలిలో నివాసముంటున్న సత్యమయ్య సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోపు వారి ఆరేళ్ల చిన్నారి అశ్విని కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రాజగోపాల్ సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరవేశారు.
కడప పాత బస్టాండులో చిన్నారి ఏడుస్తుండగా గమనించిన అక్కడి పోలీసులు పాపను తీసుకుని పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఆ తర్వాత ఖాజీపేట పోలీసులకు విషయం తెలపడంతో వీరు వెళ్లి చిన్నారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సత్యమయ్య కుటుంబ సభ్యులు బస్సు ఎక్కకముందే అటువైపు వచ్చిన బస్సులో చిన్నారి ఎక్కి కడపకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అదృశ్యమైన రెండు గంటల్లోపే పోలీసులు స్పందించి చిన్నారిని క్షేమంగా అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజగోపాల్ మాట్లాడుతూ రహదారి పక్కన నివాసముంటున్న వారు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.