దాన్నుంచి ఈ భూమిని రక్షించుకునేదెలా..!
వాషింగ్టన్: జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఓ పెద్ద ఆస్టరాయిడ్(ఉల్క) వచ్చి ఈ భూమిని ఢీకొట్టబోతోంది. రద్దీగా ఉన్న ఓ పెద్ద పట్టణంపై అది పడబోతోంది. ఆ విషయం మనకు తెలిసింది. దీనికోసం ఏం చేయాలి. ఈ ఉపద్రవం నుంచి భూమిని ఎలా కాపాడుకోవాలి.
సరిగ్గా ఇలాంటి ఊహను ఆధారంగా చేసుకొనే ఓ భారీ స్పేస్ రాక్ భూమిని తాకుతుందన్న పరికల్పనతో.. నాసా, ఫెమా(ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) సిబ్బంది అక్టోబర్ చివరన ఓ సదస్సును నిర్వహించారు. నాసా శాస్త్రవేత్తలేమో ఆ ఉల్క భూమిని చేరేలోపే దానిని దారి మళ్లించడం ఎలా అనే దానిపై దృష్టి సారిస్తే.. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ప్రజలను వేగంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అనే అంశాలపై ఫెమా ఈ సదస్సులో దృష్టి సారించింది.
అయితే వాస్తవానికి రానున్న 100 ఏళ్లలో ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టడానికి ఉన్న అవకాశాలు అత్యంత స్వల్పమని నాసా ఇదివరకే ప్రకటించింది. ఒకవేళ ఏదైనా చిన్న పరిమానంలోని ఆస్టరాయిడ్ డీకొట్టినా దానితో భూమిపై ప్రాణులకు ఏర్పడే నష్టం చాలా అత్యంత స్వల్పంగా ఉంటుందని నాసా ఇంతవరకూ చెబుతూ వస్తోంది.
అయినప్పటికీ చాలా మంది పరిశోధకులు విపత్కర పరిస్థితి ఎదురైప్పుడు చూద్దాంలే అనే ధోరణిలో కాకుండా ముందస్తు వ్యూహంతో ఉండటం మేలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల కొంతమంది ప్లానెటరీ సైంటిస్ట్‌లు, భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నాసా, ఈఎస్ఏ(యురోపియన్ స్పేస్ ఏజెన్సీ)ల ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టబోతున్న ఏఐడీఏ(ఆస్టరాయిడ్ ఇంపాక్ట్ అండ్ డిఫ్లెక్షన్ అసెస్మెంట్) మిషన్‌కు మద్దతు తెలిపారు. నాసా, ఈఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఏఐడీఏ మిషన్ ద్వారా ముందుగానే ఓ ఆస్టరాయిడ్‌ను గుర్తించి దాన్ని కైనటిక్ ఇంపాక్టర్ తో దారి మళ్లించే ప్రయత్నం ఉపయుక్తమని వారు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తుండగా మొదటి దశ కోసం నిధుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి.