రేపు మోదీతో భేటీకానున్న అన్నాడీఎంకే ఎంపీలు
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే ఎంపీలు.. ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం సమావేశంకానున్నారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడగా భావించే జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా మోదీని కోరనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధానికి లేఖ రాశారు. సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాట వారం రోజుల పాటు జల్లికట్టును నిర్వహిస్తారని, ఎప్పటి నుంచో ఈ సంప్రదాయం కొనసాగుతోందని, దీని నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పన్నీరు సెల్వం కోరారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీల బృందం నేరుగా మోదీని కలసి ఈ విషయంపై మాట్లాడనున్నారు.
2014లో జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించింది. కాగా తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా అన్ని పార్టీలు జల్లికట్టు పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నాయి. సినీ ప్రముఖులు కమల్ హాసన్, ధనుష్ కూడా జల్లికట్టుపై నిషేధం తొలగించాలని కోరారు.