మొక్కలకు సెలైన్
సాధారణంగా ఆసుపత్రిలో వైద్యం కోసం వాడే ప్లాస్టిక్ సెలైన్ బాటిల్స్ సెట్లను ఉపయోగించిన తర్వాత ఏం చేస్తారు? చెత్తకుండీల్లో పారేస్తారు. అయితే మనిషికి శక్తిని అందించేందుకు వాడే ఆ బాటిల్స్‌తో మొక్కలకు శక్తినిచ్చే నీటిని అందిస్తే ఎలా ఉంటుందన్న ఐడియా మొక్కలకు మేలు చేకూర్చింది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చంద్రాల శివారు సింగలూరు అనే గ్రామానికి చెందిన సంఘసేవకుడు డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్‌కు వచ్చిన ఈ ఆలోచన సత్ఫలితాలనిచ్చింది.
దాంతో అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నందం రమేష్ తన ఇంటిలో మొక్కలకు సెలైన్ బాటిల్స్ ద్వారా నీటిని అందించారు. ఆయనతోబాటు గ్రామస్థులంతా ఒకతాటిపై నడుస్తూ... ఊరి ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. వాటిని పశువులు మేయకుండా ట్రీగార్డుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొక్క కాండానికి అమర్చిన సెలైన్ బాటిల్ ద్వారా చుక్కలు చుక్కలుగా మొక్కకు నిరంతరాయంగా నీరు అందుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో మొక్కలు తాజాగా నవనవలాడుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. వాట్ యాన్ ఐడియా!!
- ఐకా రాంబాబు, సాక్షి, గుడ్లవల్లేరు