ఇళ్లలో పనిచేసుకుంటూ.. 85% మార్కులు!
కుటుంబ పరిస్థితులు ఆ చిన్నారి పట్టుదలను సడలించలేకపోయాయి. చదువుకోవాలన్న తన ఆకాంక్షకు పేదరికం ఏమాత్రం అడ్డు కాలేదు. అందుకే.. ఐదారిళ్లలో పని చేసుకుంటూ కూడా ఖాళీ సమయాల్లో చదువుకుని ఇంటర్ పరీక్షల్లో ఏకంగా 85 శాతం మార్కులు సాధించింది. ఆ చదువుల తల్లి పేరు షాలిని. కుటుంబాన్ని పోషించడం కోసం ఇళ్లలో పని చేసుకుంటూ ఉండేది. అలాగే చదువుకుంటూ ఇటీవల కర్ణాటక బోర్డు నిర్వహించే పీయూసీ పరీక్షలు రాసి.. వాటిలో 85 శాతం మార్కులు సంపాదించింది. ఎట్టకేలకు తన కష్టానికి ఫలితం దక్కిందని ఆమె ఆనందంగా చెప్పింది. రెండేళ్ల క్రితం పదోతరగతిలో కూడా ఆమెకు 86 శాతం మార్కులు వచ్చాయి.
ఆమె తండ్రి ఆర్ముగం దాదాపు దశాబ్దం క్రితం ఓ భవనం మీద నుంచి పడిపోయి.. అప్పటి నుంచి మంచానికే అతుక్కుపోయాడు. ఆమె తమ్ముడు సూర్య బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. షాలిని తల్లి దాదాపు పది- పన్నెండు ఇళ్లలో పనులు చేసుకుంటుంది. ఆమె ఒక్కర్తే సంపాదిస్తే కుటుంబం నడవడం కష్టమని షాలిని కూడా తనకు చేతనైనంత పని చేస్తుంటుంది. తన యజమానులు కూడా తాను ఇంగ్లీషులో మాట్లాడుతుంటే అబ్బురపడతారని, తన మార్కుల గురించి విని, పత్రికలు, టీవీలలో చూసి ఎంతగానో అభినందించారని షాలిని తెలిపింది. తమ ఇంట్లో పనిచేస్తూ కూడా ఎలా చదవగలిగావని వాళ్లు అడిగారంది. ఇప్పుడు ఆమె ఇంజనీరింగ్ చదివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేయాలని ఉత్సాహపడుతోంది. ట్రస్టులు, స్కాలర్షిప్పులు, విరాళాలతో ఎలాగోలా తాను ఇంజనీరింగ్ చదివి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.