ఆరోగ్యంతోనే దేశాభివృద్ధి
గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన రాష్ట్రపతి
వైద్య విద్యకు మౌలికవసతులు మెరుగుపరచాలని సూచన
న్యూఢిల్లీ: మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి స్మారక తపాలా బిళ్లను రాష్ట్రపతి భవన్లో బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రజలు ఆరోగ్యంగా ఉంటే విద్యా, ఆహార భద్రత, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. దీనివల్ల దేశ లక్ష్యాలను చేరుకోవడం మరింత సులువవుతుందని తెలిపారు. సమాజాన్ని వ్యాధి రహితంగా మారిస్తే దేశ ప్రగతికి బాటలు వేసినట్టేనని ప్రణబ్ వివరించారు. 1964, ఏప్రిల్ 30న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి ఇప్పటికీ మెరుగైనవైద్య సేవలు అందిస్తోందని ప్రశంసిం చారు.
వైద్య రంగం అభివృద్ధి చెందడం వల్ల అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశంలో ప్రభుత్వ వైద్య సేవలను విస్తరిం చేందుకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. గ్రామీణ జనాభా కోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య సేవలను ప్రారంభించామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు ఎన్నో పనిచేస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన శస్త్ర చికిత్సలు కూడా వైద్యులు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చుకుంటే దేశంలో ఆరోగ్యం కోసం వ్యయం చేసే నిధులు చాలా తక్కువ అని అన్నారు. ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి కేవలం 1.2 శాతంగా ఉందని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని మరింత విస్తరించడంతో పాటు వైద్య విద్య మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని చెప్పారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) తరహాలో ఆరు అదనపు సంస్థలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయమన్నారు.