పాట్నా పేలుళ్ల నిందితుల్లో ఒకరు మృతి
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ సందర్భంగా పాట్నా నగరంలో ఆదివారం సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అయినిల్ అలియాస్ తారిఖ్ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. పాట్నా నగరంలోని రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు బాంబు పేలుడు సంభవించింది. ఆ బాంబు పేలుడులో తారీఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతడిని పోలీసులు నగరంలోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారీఖ్ కోమాలోకి వెళ్లిన అతడు ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు పోలీసులకు వెల్లడించారు.
పాట్నా బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు నలుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసును బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఆదివారం పాట్నా నగరంలోని గాంధీ మైదాన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు మరణించగా, 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే.