Air Asia Company
-
ఎయిర్ ఏసియా సేల్: తక్కువకే విమాన టిక్కెట్
ముంబై : బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా మరో ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇయర్-ఎండ్ సేల్‌ను ఆదివారం ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా తన కస్టమర్లకు దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు అత్యంత తక్కువగా రూ.1,299కే అందించనున్నట్టు ఎయిర్ ఏసియా తెలిపింది. అదే అంతర్జాతీయ ప్రయాణాలకైతే, రూ.2,399కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు పేర్కొంది. పరిమిత కాల వ్యవధిలో ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. నేటి మధ్యాహ్నం నుంచి ఈ ఆఫర్ కింద విమాన టిక్కెట్లను అందించడం ప్రారంభించి, అక్టోబర్ 15 వరకు నిర్వహించనుంది. అక్టోబర్ 2 నుంచి మార్చి 31 మధ్య ప్రయాణాలన్నింటికీ ఆ ఆఫర్ వర్తించనుందని ఎయిర్ ఏసియా ఇండియా పేర్కొంది. బెంగళూరు, రాంచి, హైదరాబాద్, పూణే, కోల్కత్తా, కొచ్చి, న్యూఢిల్లీ వంటి ఇతర మార్గాలను ఈ ఆఫర్ కవర్ చేయనుంది. రూ.2,399 నుంచి విమాన టిక్కెట్లు ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాల్లో కౌలాలంపూర్, బలి, బ్యాంకాక్, క్రాబి, ఫూకెట్, మెల్బోర్న్, సిడ్నీ, సింగపూర్, ఆక్లాండ్లతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్యప్రాచ్య, అమెరికా వ్యాప్తంగా 120కి పైగా గ్లోబల్ మార్గాలున్నాయి. అంతేకాక ఈ ప్రమోషనల్ ధరలు కొత్తగా ఎయిర్ సర్వీసులు లాంచ్ అయిన ప్రాంతాలకు వర్తించనున్నాయని ఎయిర్ ఏసియా తెలిపింది. ఎయిర్ఏసియా పోర్టల్ లేదా తన మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు చెప్పింది. -
త్వరలో వివిధ రాష్ట్రాలకు విమాన సేవలు
దావణగెరె, న్యూస్‌లైన్ : టాటా కంపెనీ, సింగపూర్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎయిర్ ఏషియా కంపెనీ భారత్‌లోని వివిధ రాష్ట్రాలలో పౌర విమానయాన సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీఎం.సిద్దేశ్వర్ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జూన్ 15 నుంచి గోవా-చెన్నై మధ్య విమాన సర్వీసు ప్రారంభిస్తామని, ఇప్పటికే టికెట్ అమ్మకాల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ప్రయాణికులకు అనువుగా అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రైవేట్ ఎయిర్ లైన్ కంపెనీ ముందుకు వస్తే వారికి కూడా విమాన టికెట్ల అమ్మకం అవకాశం కల్పిస్తామన్నారు. ఈ దిశగా ప్రతి మూడు నాలుగు జిల్లాలకు ఒక విమానాశ్రయం, ఎయిర్‌స్ట్రిప్ స్థాపిస్తామన్నారు. దీంతో దేశానికి అధిక లాభం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి గత సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బళ్లారి విమానాశ్రయ భూస్వాధీన ప్రక్రియ జరగలేదన్నారు. బీజాపురలో 727 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, అయితే అక్కడ బండరాయి వచ్చిందని, దాన్ని తొలగించేందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఇంకా గుల్బర్గా, శివమొగ్గలలో విమానాశ్రయాల నిర్మాణ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని, శివమొగ్గలో నాసిరకం పనులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల లెసైన్సులను రద్దు చేసిందని వివరించారు. ఈ విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. హాసన్‌లో 760 ఎకరాలు అవసరముండగా అక్కడ 530 ఎకరాల భూమి మాత్రమే స్వాధీనం జరిగిందన్నారు. కారవార, బీదర్ జిల్లాలలో రక్షణ శాఖ విమానాశ్రయాలు నిర్మించనున్నారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.రామచంద్ర, మాడాళు విరుపాక్షప్ప, జయప్రకాశ్, హెచ్ఎస్.శివకుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.