ఎయిర్ ఏషియా 'తోక' కోసం ముమ్మర గాలింపు
జకార్తా: జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం తోక భాగాన్ని వెలికితీయడానికి ఇండోనేషియా అన్వేషణ, రక్షణ విభాగం సిద్ధమైంది. ఇండోనేషియా ప్రభుత్వం ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా 15 మంది గజ ఈతగాళ్లను సముద్రంలోకి పంపింది. డిసెంబరు 28న 162 మందితో వెళ్తున్న ఈ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా అదృశ్యమై, సముద్రంలో పడిపోయిన సంగతి తెలిసిందే.
తేలియాడే బెలూన్లు, క్రేన్ల సాయంతో తోక భాగాన్ని వెలికితీస్తామని అధికారులు తెలిపారు. జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా క్యుజడ్ 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేయగా వెలుతురు లేని కారణంగా పనిని మధ్యలోనే ఆపేశారు. ఇప్పటిదాకా సముద్రం నుంచి 46 మృతదేహాలను వెలికితీశారు.