Air Deccan
-
కోపానికి, అహంకారానికి మాల్యా బాధితుడు
ముంబై : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయమాల్యా కోపానికి, అహంకారానికి బాధితుడని ఎయిర్‌డెక్కన్ చైర్మన్ జీ ఆర్ గోపినాథ్ అన్నారు. రాజకీయ కుట్ర కంటే కూడా ఆయన ఎక్కువగా కోప, అహంకారాల్లోనే ఇరుక్కుపోయారని చెప్పారు. 2007లో ఎయిర్‌డెక్కన్‌ను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రూ.1000 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం 2012లో కింగ్‌ఫిషర్ దివాలా స్థాయికి పడిపోయింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల బకాయిపడింది. బ్యాంకులకు రుణ పడిన ఈ కోట్ల మొత్తాన్ని ఎగ్గొట్టిన మాల్యా యూకేకు పారిపోయారు. ప్రస్తుతం మాల్యా యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయన్ను భారత్‌కు రప్పించడానికి ఏజెన్సీలు తీవ్ర ఎత్తున్న కసరత్తు చేస్తున్నాయి. మాల్యా అప్పగింత కేసును లండన్ కోర్టు విచారిస్తోంది. ఆయనను పొలిటికల్ ఫుట్బాల్లా రిఫర్ చేస్తూ.... డిఫాల్డ్ అయిన సమయంలో మాల్యా తన కార్యక్రమాల్లో అంత తెలివిగా ఉండేవారు కాదని పేర్కొన్నారు. రుణాల ఎగవేతకు మాల్యా పోస్టర్ బాయ్‌లా ఉన్నారని అభివర్ణించారు. రెండు పార్టీలు కూడా తాము సౌకర్యవంతం కోసం రాజకీయంగానే గుర్తిస్తున్నారన్నారు. మాల్యా రాజకీయ కుట్రకు బాధితుడు కాదని, ఆయన ప్రతి ఒక్కరికీ 'హాట్ పొటాటో' అన్నారు. -
ఎయిర్ డెక్కన్ మరో జర్నీ
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి చౌక విమానయాన సేవల్లోకి ప్రవేశించి... అతితక్కువ ఛార్జీకే ఆకాశయానాన్ని పరిచయం చేసిన ‘ఎయిర్ డెక్కన్’... రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఉడాన్ కింద తొలి విమానాన్ని నడపటానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 22 నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. నాసిక్ నుంచి ముంబైకు వెళ్లే ఈ విమాన ప్రయాణం కోసం... రూ.1,400ల ప్రారంభ ధరతో గురువారం నుంచి బుకింగ్స్ ఆరంభిస్తోంది. ఎయిర్ డెక్కన్ తొలిగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్ నుంచి ఇతర చిన్న పట్టణాలకు ఫ్లైట్స్‌ను నడపనుంది. ఇది ‘సింప్లిఫై’ ట్యాగ్‌లైన్‌తో ‘సామాన్యులకు విమాన ప్రయాణం’ లోగోతో రీఎంట్రీ ఇస్తోంది. రూ.1 ఆరంభ ఆఫర్ ఎయిర్ డెక్కన్ తన కార్యకలాపాలను మళ్లీ ప్రారంభిస్తున్న సందర్భంగా రూ.1కే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది అందరికీ కాదు. కొందరికి మాత్రమే. ‘కొందరు అదృష్టవంతులు ఒక్క రూపాయికే ప్రయాణించొచ్చు. సాధారణంగా నాసిక్–ముంబై ఫ్లైట్ విమాన ప్రయాణం ధర దాదాపు రూ.1,400గా ఉండొచ్చు’ అని కెప్టెన్ గోపీనాథ్ తెలిపారు. నాసిక్, పుణె, ముంబై, జల్గావ్లకు డైలీ రిటర్న్ ఫ్లైట్స్ నడుపుతామని ఆయన చెప్పారు. జనవరి నుంచి నాలుగు ఫ్లైట్స్తో సర్వీసుల నడుపుతామని, ఒక్కదాన్ని రిజర్వులో ఉంచుతామని తెలిపారు. ‘మా విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ మా చిన్న ప్లేన్స్‌కు స్లాట్స్ కేటాయించటం లేదు. పౌరవిమానయాన శాఖకు పలు అభ్యర్థనలు చేశాకే స్లాట్స్‌ను పొందాం’ అని గోపినాథ్ తెలిపారు. ఎయిర్ డెక్కన్ గురించి.. కెప్టెన్ జి.ఆర్.గోపినాథ్ 2003లో ఎయిర్ డెక్కన్ను ఏర్పాటు చేశారు. ఇది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేది. అప్పుడు చౌక ధరల విమాన సర్వీసులకు ఇది పేరొందింది. కానీ తర్వాత నష్టాలు ఎక్కువ కావడంతో 2008లో ఎయిర్ డెక్కన్ను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దీన్ని కింగ్‌ఫిషర్ రెడ్‌గా రీబ్రాండ్ చేసింది. కానీ తర్వాత ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012లో మూతపడింది. కాగా మార్చిలో జరిగిన తొలి రౌండ్ బిడ్డింగ్‌లో దేశవ్యాప్తంగా 120 రూట్లలో విమానాలు నడపటానికి ఉడాన్ పథకం కింద ఐదు సంస్థలు అనుమతి పొందాయి. వాటిలో అలయన్స్ ఎయిర్, స్సైస్ జెట్, ఎయిర్ ఒడిషాతో పాటు ఎయిర్ డెక్కన్, తెలుగు రాష్ట్రాలకు చెందిన టర్బో మేఘా ఎయిర్‌లైన్స్ (ట్రూ జెట్) కూడా ఉన్నాయి. ట్రూజెట్ ఇప్పటికే తన ఉడాన్ సేవలు ప్రారంభించింది. ఎయిర్‌డెక్కన్ ఇపుడు ప్రారంభిస్తోంది. గంట విమాన ప్రయాణానికి కనీస టికెట్ ధర రూ.2,500. టైర్–2, టైర్–3 పట్టణాలకు విమాన సర్వీసులకు విస్తరించటం, సామన్యులకు విమాన ప్రయాణం చేరువ చేయడం అనే లక్ష్యంతో కేంద్రం ఉడాన్ స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. రెండో రౌండ్ బిడ్డింగ్‌లో ఇండిగో, జెట్ ఉడాన్ రెండో రౌండ్ బిడ్డింగ్‌లో ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, జూమ్ ఎయిర్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఇవి ఇప్పటికే బిడ్లు వేశాయి. ఉడాన్ స్కీమ్‌లో పాల్గొనే సంస్థలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కోరుకోవచ్చు. ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు వీజీఎఫ్ అక్కర్లేదని పేర్కొన్నాయి. ఇండిగో, జెట్ ఎయిర్వేస్ మాత్రం తొలిసారి బిడ్గింగ్లో పాల్గొంటున్నాయి. -
రూ.1 కే విమాన టికెట్
సాక్షి, ముంబై: దేశీయ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ డెక్కన్ విమాన ప్రయాణీకులకు బంపర్ఆఫర్ ఇచ్చింది. భారీ రుణ ఎగవేత దారుడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వినీం, సంక్షోభం, 2012లో కార్యకలాపాలు మూసివేత అనంతరం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా తమ కస్టమర్లకు రూ.1 కే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బడ్జెట్ క్యారియర్ తొమ్మిది సంవత్సరాల తర్వాత దాని కార్యకలాపాలను పునఃప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తొలి విమానం డిసెంబర్ 22 న గాల్లోకి ఎగరనుంది. నాసిక్ నుంచి ముంబయికి ఈ సర్వీసును ప్రారంభించనున్నామని కెప్టెన్ గోపినాథ్ తెలిపారు. ప్రారంభ అదృష్టవంతులైన కొంతమంది ప్రయాణీకులు ఒక రూపాయికే టికెట్ పొందవచ్చని చెప్పారు. కాగా ఉడాన్ పథకం కింద విమాన సర్వీసులను నడిపేందుకు అనుమతి పొందిన వాటిల్లో ఎయిర్ డెక్కన్ కూడా ఒకటి. ఈ పథకం కింద ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించేందుకు దేశంలోని లాభాపేక్షలేని, విమానాశ్రయాలను అనుసంధానించే విమానాల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో స్పైస్‌జెట్, ఎయిర్ ఒడిషా, ఎయిర్ ఇండియా అనుబంధ ఎయిర్‌లైన్ అల్లైడ్ సర్వీసెస్, ఎయిర్ డెక్కన్, టర్బో మెఘా అనుమతి పొందాయి. ఇవి దేశవ్యాప్తంగా 70 విమానాశ్రయాలను కలిపే 128 మార్గాల్లో విమాన సేవలు నిర్వహిస్తాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, షిల్లాంగ్ లలో తన సర్వీసులను ప్రారంభిస్తోంది. -
మరో రెండు ఎయిర్‌లైన్స్ ‘ఉడాన్’
సెప్టెంబర్ నుంచి ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిషా సర్వీసులు న్యూఢిల్లీ: ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. ఆర్సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ–1900డి విమానాలను సమకూర్చుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.