మరో రెండు ఎయిర్‌లైన్స్ ‘ఉడాన్’
సెప్టెంబర్ నుంచి ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిషా సర్వీసులు
న్యూఢిల్లీ: ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్‌సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. ఆర్‌సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ–1900డి విమానాలను సమకూర్చుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.