RCS
-
రవాణాశాఖ సేవలకు ఇక ‘వాహన్ సారథి’
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ నమోదు ద్వారా కొన్ని సేవలు నేరుగా, మరికొన్ని పరోక్షంగా లభిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్స్, వాహనాల నమోదు బదిలీ వంటి పౌరసేవలను వాహన వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నింటిపైన ఏకీకృత విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన వాహన్ సారథిని గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం టీ–యాప్ ఫొలియో వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ప్రత్యక్ష సేవలను పొందేందుకు అవకాశం ఉండగా త్వరలో వాహన్ సారథిని వినియోగించుకొనే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాహనాల వివరాలన్నింటినీ వాహన్లోనూ, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలను సారథిలోనూ నిక్షిప్తం చేయనున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ సమాచారం కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) ద్వారా ఈ వివరాలన్నింటినీ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట లైసెన్స్‌ల డేటా నమోదు సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలు సారథిలో నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకొనే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్స్ చేసుకోవడం, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌లను బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్స్‌ల మొత్తం డేటా సారథిలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ సర్విసులను పొందే అవకాశం ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ, ఆమోదంతోనే సర్విసుల బదిలీ సదుపాయం లభించనుంది. ఇందుకోసం ఆన్లైన్లోనే నిరీ్ణత ఫీజు చెల్లించి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతంగ్రేటర్ హైదరాబాద్‌లోని 3 జిల్లాల పరిధిలో 62,7056 లైసెన్స్‌లు ఉన్నాయి. సుమారు 83 లక్షల వాహనాలు నమోదై ఉన్నాయి. వాహనాల నమోదుకు ‘వాహన్’ ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వాహనాల వివరాలను ‘వాహన్’లో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ‘వాహన్’లో ఇటీవల తెలంగాణ కూడా చేరేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం వాహనాల డేటాను వాహన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. దీనిద్వారా వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లలో శాశ్వత రిజి్రస్టేషన్ సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను (టీఆర్) ఇస్తున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ (ఆర్సీ) చేస్తున్నారు. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాన్ని బదిలీ చేసేందుకు ఎన్ఓసీల అవసరం ఉండదు. సదరు వాహనం వివరాలను ‘వాహన్’లో ధ్రువీకరించుకుని బదిలీ చేయవచ్చు. అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుందని అధికారులు చెప్పారు. వాహనాల సామర్థ్య పరీక్షలను కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా నిర్వహించడంతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లోనే లెరి్నంగ్ పరీక్షలు ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా హైదరాబాద్‌లోనూ ఆన్లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలనే రవాణా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల విని యోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవస రం ఉండదు. ఇంటి నుంచి ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసె న్స్) పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మరో నెల వరకు పొడిగించుకొనే సదుపాయం ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం టెస్ట్ట్రాక్లలో అధికారులు నిర్వ హించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. -
నయా లుక్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయ్!
సాక్షి, సిటీబ్యూరో: నయా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయి. ఇప్పటివరకు తెలుపు రంగు కార్డుపై నలుపు, ఎరుపు రంగులో ముద్రించిన అక్షరాలతో కనిపించిన స్మార్ట్ కార్డులు ప్రస్తుతం లేత ఆకుపచ్చ, నీలి రంగుల్లో నలుపు అక్షరాలతో అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని అమలు చేసేందుకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల్లో మార్పులు చేశారు. కేంద్ర మోటా రు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్మార్ట్‌కార్డులను అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పాత స్మార్ట్‌కార్డులపై ముద్రించిన అక్షరాల కంటే కొత్త కార్డులపై ముద్రించిన అక్షరాల సైజును పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే నమూనాలో ఉండేవిధంగా వీటిని రూపొందించారు. దేశంలో ఎక్కడి నుంచైనా.. ♦ కేంద్ర మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఏకీకృత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు వాహన్ సారథి పోర్టల్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, డ్రైవర్ల వివరాలు నమోదవుతాయి. ఇటీవల వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాహన్ సారథి పోర్టల్‌తో అనుసంధానమై ఉండేవి. వాహన సారథి పోర్టల్‌లో లేని రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలు లేకపోవడంతో కేంద్ర మోటారు వాహన చట్టం (సీఎంవీ) అమల్లో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయి. ♦ వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలు, వాహనదారులను ఈ చట్టం పరిధిలో గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ తాజాగా వాహన్ సారథిలో చేరడంతో తెలంగాణకు చెందిన వాహనాలు, డ్రైవర్ల వివరాలు దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు. ఇందుకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చేసినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్డుల కొరత తీరింది.. ♦ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 3.5 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌కార్డుల కొరత తీరినట్లు అధికారులు తెలిపారు. కొత్త సాంకేతిక వ్యవస్థతో పాటే కార్డుల ప్రింటింగ్, పంపిణీకి తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్డులు లేకపోవడంతో 3 నెలలుగా ప్రింటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ♦ లక్షలాది మంది వాహనదారులు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ కేంద్రాల చుట్టూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొత్త కార్డులు రావడంతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వాటిని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఏ రోజు డిమాండ్ మేరకు ఆ రోజే కార్డులను ముద్రించి అందజేసే అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
మరో రెండు ఎయిర్‌లైన్స్ ‘ఉడాన్’
సెప్టెంబర్ నుంచి ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిషా సర్వీసులు న్యూఢిల్లీ: ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. ఆర్సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ–1900డి విమానాలను సమకూర్చుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది. -
ఇక ‘చౌక’ విమానం టేకాఫ్..!
♦ ప్రాంతీయ విమానయాన పథక ముసాయిదా ఆవిష్కరణ ♦ గంట ప్రయాణానికి రూ.2,500లే చార్జీ ♦ ఆర్సీఎఫ్ ఏర్పాటు... ♦ టికెట్ ధరలు స్వల్పంగా పెరగొచ్చు! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాంతీయ విమానయాన పథకపు (రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్-ఆర్సీఎస్) ముసాయిదాను విడుదల చేసింది. వీలైనన్ని కొత్త మార్గాల్లో విమానాలను నడపడం ద్వారా దేశంలో ప్రాంతీయ విమానయానాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ పౌర విమానయాన పాలసీలో ఈ ఆర్సీఎస్ ఒక ముఖ్యమైన భాగం. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. పరిమిత సంఖ్యలో సీట్ల టికెట్ల ధరలపై నియంత్రణ విధించడం, పన్ను ప్రోత్సాహకాలు అందించడం, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌స్ట్రిప్స్ సహా విమానాశ్రయాలను పునరుద్ధరించడం వంటి పలు కీలకాంశాలను పథకంలో పొందుపరిచామని తెలిపారు. ప్రాంతీయ విమానయానాన్ని పెంపొందించడానికి పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని, వాటిల్లో సేల్స్ ట్యాక్స్ చాలా తక్కువ స్థాయిలో నిర్ణయించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై అభిప్రాయాల స్వీకరణకు మూడు వారాల గడువునిచ్చింది. విమానయాన రంగ సంబంధిత అధికారులు, ప్రజలు, విమానయాన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు వాటి అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ పథకం ఆగస్ట్‌కల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పథకంలోని ముఖ్యాంశాలు ⇒ అన్ సర్వ్డ్, అండర్ సర్వ్డ్ ఎయిర్ సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దేశంలో 394 అన్ సర్వ్డ్, 16 అండర్ సర్వ్డ్ విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే 200-800 కిలోమీటర్ల మార్గానికి మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ⇒ ఎయిర్‌లైన్స్ ఒక్క విమానంతోనూ సేవలను ప్రారంభించొచ్చు. ⇒ అభివృద్ధి చెందిన ఎయిర్‌పోర్ట్స్ నుంచి అన్ సర్వ్డ్ (నిరుపయోగంగా ఉన్న) విమానాశ్రయాలకు గంట ప్రయాణానికి (దాదాపు 500 కిలోమీటర్లకు) విమాన చార్జీ రూ.2,500గా ఉంటుంది. టికెట్ ధరల నియంత్రణ కొన్ని సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. ⇒ ప్రయాణం గంట కన్నా తక్కువ సమయమే ఉంటే (200-225 కిలోమీటర్లు).. అప్పడు టికెట్ ధర రూ.1,770గా, అదే 800 కిలోమీటర్ల వరకు ఉంటే రూ.4,070గా ఉంటుంది. ⇒ ఎయిర్‌లైన్స్ ఈ స్కీమ్‌లో భాగస్వాములు కావాలనుకుంటే.. సం బంధిత రూట్‌కు రూ.50 లక్షలకు బ్యాంక్ వారంటీ ఇవ్వాల్సి ఉంది. ⇒ ప్రభుత్వం ఆర్సీఎస్ ఎయిర్‌పోర్ట్స్‌కు సర్వీస్ ట్యాక్స్‌లో, వ్యాట్‌లో పన్ను ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇక ఈ ఎయిర్‌పోర్ట్‌ల భద్రత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ⇒ పథకంలోని విమానాలపై ఎలాంటి పార్కింగ్, నావిగేషన్, ల్యాండింగ్ చార్జీలు ఉండవు. ⇒ ఆసక్తి ఉన్న ఆపరేటర్లు ఏ ఏ మార్గాల్లో సర్వీసులను నడుపుతారో ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. ⇒ ఆయా మార్గాల్లో ఏమైనా నష్టాలొస్తే వీజీఎఫ్ ఫండ్ ద్వారా వారికి నిధులను సమకూరుస్తుంది. ఆర్సీఎఫ్ ఏర్పాటు.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ద్వారా ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యక్షంగా ఆర్థిక సాయమందిస్తుందని పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ సర్వ్డ్, అండర్ సర్వ్డ్ ఎయిర్‌పోర్ట్స్‌కు సర్వీసులను ప్రారంభించే ఎయిర్‌లైన్స్ మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుందని పేర్కొంది. వీజీఎఫ్ కోసం ప్రత్యేకంగా రీజినల్ కనెక్టివిటీ ఫండ్(ఆర్సీఎఫ్)ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొన్ని మార్గాల్లో నడిచే విమానాలపై సుంకాన్ని విధించడం ద్వారా ఈ ఫండ్‌కు నిధులను సమీకరిస్తామని పేర్కొంది. వీజీఎఫ్లో 80% కేంద్రం సమకూరుస్తుందని, మిగిలిన 20% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందని తెలిపింది.