ఇక ‘చౌక’ విమానం టేకాఫ్..! | Government subsidy to enable low-cost regional flights | Sakshi
Sakshi News home page

ఇక ‘చౌక’ విమానం టేకాఫ్..!

Published Sat, Jul 2 2016 12:56 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM

ఇక ‘చౌక’ విమానం టేకాఫ్..! - Sakshi

ఇక ‘చౌక’ విమానం టేకాఫ్..!

ప్రాంతీయ విమానయాన పథక ముసాయిదా ఆవిష్కరణ
గంట ప్రయాణానికి రూ.2,500లే చార్జీ
ఆర్‌సీఎఫ్ ఏర్పాటు...
టికెట్ ధరలు స్వల్పంగా పెరగొచ్చు!

 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాంతీయ విమానయాన పథకపు (రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్-ఆర్‌సీఎస్) ముసాయిదాను విడుదల చేసింది. వీలైనన్ని కొత్త మార్గాల్లో విమానాలను నడపడం ద్వారా దేశంలో ప్రాంతీయ విమానయానాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం.  ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ పౌర విమానయాన పాలసీలో ఈ ఆర్‌సీఎస్ ఒక ముఖ్యమైన భాగం. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. పరిమిత సంఖ్యలో సీట్ల టికెట్ల ధరలపై నియంత్రణ విధించడం, పన్ను ప్రోత్సాహకాలు అందించడం, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌స్ట్రిప్స్ సహా విమానాశ్రయాలను పునరుద్ధరించడం వంటి పలు కీలకాంశాలను పథకంలో పొందుపరిచామని తెలిపారు.

 ప్రాంతీయ విమానయానాన్ని పెంపొందించడానికి పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని, వాటిల్లో సేల్స్ ట్యాక్స్ చాలా తక్కువ స్థాయిలో నిర్ణయించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై అభిప్రాయాల స్వీకరణకు మూడు వారాల గడువునిచ్చింది. విమానయాన రంగ సంబంధిత అధికారులు, ప్రజలు, విమానయాన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు వాటి  అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ పథకం ఆగస్ట్‌కల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 పథకంలోని ముఖ్యాంశాలు
అన్ సర్వ్‌డ్, అండర్  సర్వ్‌డ్ ఎయిర్ సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దేశంలో 394 అన్ సర్వ్‌డ్, 16 అండర్ సర్వ్‌డ్ విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే 200-800 కిలోమీటర్ల మార్గానికి మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌లైన్స్ ఒక్క విమానంతోనూ సేవలను ప్రారంభించొచ్చు.

అభివృద్ధి చెందిన ఎయిర్‌పోర్ట్స్ నుంచి అన్ సర్వ్‌డ్ (నిరుపయోగంగా ఉన్న) విమానాశ్రయాలకు గంట ప్రయాణానికి (దాదాపు 500 కిలోమీటర్లకు) విమాన చార్జీ రూ.2,500గా ఉంటుంది. టికెట్ ధరల నియంత్రణ కొన్ని సీట్లకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రయాణం గంట కన్నా తక్కువ సమయమే ఉంటే (200-225 కిలోమీటర్లు).. అప్పడు టికెట్ ధర రూ.1,770గా, అదే 800 కిలోమీటర్ల వరకు ఉంటే రూ.4,070గా ఉంటుంది.

ఎయిర్‌లైన్స్ ఈ స్కీమ్‌లో భాగస్వాములు కావాలనుకుంటే.. సం బంధిత రూట్‌కు రూ.50 లక్షలకు బ్యాంక్ వారంటీ ఇవ్వాల్సి ఉంది.

ప్రభుత్వం ఆర్‌సీఎస్ ఎయిర్‌పోర్ట్స్‌కు సర్వీస్ ట్యాక్స్‌లో, వ్యాట్‌లో పన్ను ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇక ఈ ఎయిర్‌పోర్ట్‌ల భద్రత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.

పథకంలోని విమానాలపై ఎలాంటి పార్కింగ్, నావిగేషన్, ల్యాండింగ్ చార్జీలు ఉండవు.

ఆసక్తి ఉన్న ఆపరేటర్లు ఏ ఏ మార్గాల్లో సర్వీసులను నడుపుతారో ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.

ఆయా మార్గాల్లో ఏమైనా నష్టాలొస్తే వీజీఎఫ్ ఫండ్ ద్వారా వారికి నిధులను సమకూరుస్తుంది.

 ఆర్‌సీఎఫ్ ఏర్పాటు..
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ద్వారా ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యక్షంగా ఆర్థిక సాయమందిస్తుందని పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ సర్వ్‌డ్, అండర్ సర్వ్‌డ్ ఎయిర్‌పోర్ట్స్‌కు సర్వీసులను ప్రారంభించే ఎయిర్‌లైన్స్ మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుందని పేర్కొంది. వీజీఎఫ్ కోసం ప్రత్యేకంగా రీజినల్ కనెక్టివిటీ ఫండ్(ఆర్‌సీఎఫ్)ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొన్ని మార్గాల్లో నడిచే విమానాలపై సుంకాన్ని విధించడం ద్వారా ఈ ఫండ్‌కు నిధులను సమీకరిస్తామని పేర్కొంది. వీజీఎఫ్‌లో 80% కేంద్రం సమకూరుస్తుందని, మిగిలిన 20% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందని తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement