టీడీపీ పని ఔటేనా? అశోక్‌ గజపతి రాజు మాటల్లో అంతరార్థం ఏంటీ? | ashok gajapathi raju unsatisfied on tdp chandrababu behaviour | Sakshi
Sakshi News home page

టీడీపీ పని ఔటేనా? అశోక్‌ గజపతి రాజు మాటల్లో అంతరార్థం ఏంటీ?

Published Sat, Apr 6 2024 8:08 PM | Last Updated on Sat, Apr 6 2024 8:17 PM

ashok gajapathi raju unsatisfied on tdp chandrababu behaviour - Sakshi

తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందా? పార్టీ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితులు ఎన్నడూ లేవా? చంద్రబాబు నాయకుడి అసమర్ధ సారధ్యమే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందా? ఇక పార్టీకి భవిష్యత్తు లేనట్లేనా? టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మనోభావాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔను అన్న సమాధానాలే వస్తాయి. పార్టీ దుస్థితిని చూసి తట్టుకోలేకపోయిన అశోక్ గజపతి రాజు వంటి సీనియరే ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండలేనని చెప్పేసినట్లు సమాచారం. అంతగా అవసరం అనుకుంటే సలహాలు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారని పార్టీ వర్గాల్లోనే కలకలం రేగుతోంది.

తెలుగుదేశం పార్టీ  నడక ఎలా సాగుతోంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఇపుడు ఎంత బలహీనంగా అడుగులు పడుతున్నాయి? ఎన్టీయార్ టిడిపిని స్థాపించినప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించారు. చాలా మంది రాజకీయ జీవితాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పటి టిడిపి నేతలందరికీ అది ఒక స్వర్ణ యుగం.

ఎన్నో విలువలతో ఏర్పడిన నాటి టిడిపి  ఎన్టీయార్ తోనే కనుమరుగు అయిపోయింది. ఇపుడున్న  టిడిపి చంద్రబాబు నాయకత్వంలో పాతాళం దిశగా శరవేగంగా దిగజారిపోతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. ఆ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీతో నేరుగా చేతులు కలిపిన రోజునే  టిడిపిలో ఎన్టీయార్ తాలూకు ఆనవాళ్లు ఏమన్నా ఉంటే అవి మాయం అయిపోయాయి గత సిద్ధాంతాలకు కాలం చెల్లింది.

చంద్రబాబు నాయుడి  అవకాశవాద రాజకీయాలు టిడిపిని దివాళా తీయించాయనే చెప్పాలి. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అందులో ఉండి ఆ తర్వాత ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచినపుడు చంద్రబాబుతో అంటకాగిన సీనియర్ నేతలు సైతం టిడిపిని చంద్రబాబు నడిపిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పార్టీలో ఇక  క్రియాశీలకంగా కొనసాగలేం అని నిర్ణయించేసుకుంటున్నారు.

తాజాగా ఉత్తరాంధ్రలో  ఎన్టీయార్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన వెన్నుపోటు సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉన్న అశోక్ గజపతి రాజు  ప్రస్తుతం టిడిపి  తీరుపై  కోపంగా ఉన్నారు. ఒకపక్క బిజెపితో ప్రత్యక్ష స్నేహం. మరోవైపు కాంగ్రెస్ తో చీకటి స్నేహం. ఇంత దగుల్బాజీ రాజకీయాలను తన కెరీర్ లోనే చూడలేదని అశోక్ గజపతి రాజు  తన అనుయాయులతో  అంటున్నట్లు సమాచారం.

పార్టీ అధినేతగా చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరి..ఆయన మాటల తీరు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడు శింగనమల నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని హేళన చేస్తూ పేదలను అవమానిస్తూ డ్రైవర్ల పట్ల తనకున్న  ఏవగింపును చాటుకున్నారు.  దీనిపై సోషల్ మీడియాలో  విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఔను చంద్రబాబూ.. మాది పేదల పార్టీ కాబట్టే  పేదవాడైన టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాం..మరో చోట ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం? మీలా మాది పెత్తందార్ల పార్టీ కాదు కదా అని చురకంటించారు.

ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి వెకిలి మాటలు.. దానికి  జగన్ మోహన్ రెడ్డి దీటైన సమాధానం పైనే చర్చ నడుస్తోంది. దీంతోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపుతో  ఎన్నికల వేళ వాలంటీర్ల చేత పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించకుండా ఆంక్షలు విధించాలంటూ  నిమ్మగడ్డ రమేష్ చేత  ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు అందుకున్న ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. 

దాంతో ఒకటో తారీఖున తెల్లవారు జామునే పింఛన్లను తమ ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు  ఏప్రిల్ ఒకటో తేదీన రాకపోవడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు నరకయాతన పడ్డారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి టిడిపి పార్టీయే అని తెలుసుకుని వారు మండిపడుతున్నారు.  ఎన్నికల వేళ వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసి ఏదో విజయం సాధించామని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఈ నేలబారు రాజకీయంతో ప్రజల్లో ఆయనపట్ల వ్యతిరేకత ఎన్నో రెట్లు పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు.

ఇక పొత్తుల కోసం బిజెపి అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వెంపర్లాడ్డం కూడా  టిడిపి  సీనియర్లకు  నచ్చడం లేదు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపితో పొత్తుకోసం చంద్రబాబు నాయుడు అంతలా దేబిరించాల్సిన అవసరం ఏముందని? సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలోనే  ఉత్తరాంధ్ర సీనియర్ నేత అశోక్ గజపతి రాజు  తన అనుచరులతో మాట్లాడుతూ టిడిపి ఇంత అధ్వాన్న స్థితికి పడిపోడానికి కారణం చంద్రబాబు  అసమర్ధ నాయకత్వమే అని పెదవి విరిచారట. ఇక ఈ పార్టీలో యాక్టివ్ గా ఉండలేనని అస్త్ర సన్యాసం ప్రకటించారట.  పార్టీ నాయకత్వానికి కావాలని అనుకుంటే సలహాలు సూచనలు ఇస్తాను తప్ప నేనైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేని అని తేల్చి చెప్పేశారట.

ఈ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం ఖాయమన్న సంకేతాలను చాలా సర్వేలు  అందించాయి. జగన్ మోహన్ రెడ్డి  నిర్వహిస్తోన్న  మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లక్షలాదిగా జనం తరలి వస్తోంటే చంద్రబాబు నాయుడి ప్రజాగళానికి జనం మొహం చాటేస్తున్నారు. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో ఈ  కార్యక్రమాలే చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లంతా ఒక్కసారిగా  చంద్రబాబు పై తిరుగుబాటు చేయడం ఖాయమంటున్నారు వారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement