త్వరలో విజయవాడ, రాజమండ్రికి... ఎయిర్ పెగాసస్ సర్వీసులు
సాక్షి, బెంగళూరు: దేశీయ విమానయాన సంస్థ ‘ఎయిర్ పెగాసస్’ తొలి వార్షికోత్సవ సందర్భంగా సేవలను విస్తరించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి నగరాలకు త్వరలోనే సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. ‘ఎయిర్ పెగాసస్’ విమానయాన సేవలను ప్రారంభించి ఏడాది పూర్తై సందర్భంగా బెంగళూరులో గురువారం విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ షైషన్ థామస్ మాట్లాడారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రస్తుతం తమ సంస్థ హుబ్లీ, తిరువనంతపురం, మధురై, మంగళూరు, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోందని తెలిపారు. ఏడాది కాలంలో మొత్తం 2,80,000 మంది ప్రయాణికులు తమ విమాన సర్వీసుల్లో ప్రయాణించారని చెప్పారు. దక్షిణ భారతదేశంలో మరిన్ని ఎక్కువ పట్టణాలకు సేవలను విస్తరించే దిశగా రూ.100 కోట్లను అదనం గా వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్ అశ్విన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.