భద్రత... శుభ్రత
సాక్షి, సిటీబ్యూరో: మ్యాన్‌హోళ్లలోకి దిగి మృత్యువాతపడుతోన్న సీవరేజి కార్మికుల ప్రాణాలకు భరోసానిచ్చేందుకు జలమండలి మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు ఒక్కొక్క యంత్రాన్ని చొప్పున 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేపట్టింది. వీటితో మ్యాన్‌హోళ్లు, పైపులైన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆధునిక జెట్టింగ్ యంత్రాలతో తొలగించి సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు. అద్దె ప్రాతిపదికన వీటిని తీసుకునేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు జలమండలి ఎం.డి. దానకిశోర్ తెలిపారు.
మినీ ఎయిర్‌టెక్ తీరిదీ
రెండువేల సీసీ ఇంజిన్ సామర్థ్యంగల మినీ ఎయిర్‌టెక్ వాహనానికి రెండువేల లీటర్ల మురుగు నీటిని తోడే ట్యాంక్, 70 హార్స్పవర్ సామర్థ్యంగల జెట్టింగ్ యంత్రం,మురుగునీటిని తోడేందుకు వీలుగా పైపు, మోటార్, ఇతర ఉపకరణాలు ఉంటాయి. దీని బరువు సుమారు 6 టన్నుల లోపే. ఖరీదు సుమారు రూ.10 లక్షలు ఉంటుంది. డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచి కాలనీలు, బస్తీల్లో నిత్యం ఉప్పొంగుతున్న మ్యాన్‌హోల్‌లను శుభ్రం చేయనున్నారు. ఇరుకు వీధుల్లోకి కూడా ఈ వాహనం చొచ్చుకొని వెళ్లగలదు. వ్యర్థాలను బట్టి మీటరుకు రూ.10 చొప్పున అద్దె చెల్లించనున్నట్లు సమాచారం.