గాలి నుండి నీరు!
సమ్‌థింగ్ స్పెషల్
ఎండాకాలం వచ్చిందంటే ఒక్క బిందె నీటి కోసం మహిళలు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితిని నేడు మనం చూస్తున్నాం. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పేద ప్రజలకు వేసవి కాలంలో ఇదో తప్పని అగ్నిపరీక్ష. అయితే ఈ ఏడాది మాత్రం ఆ కష్టం ఉండబోదంటే నమ్ముతారా? నమ్మాలి మరి. ఎందుకంటే మన ఇంటికి కావలసిన నీటిని మనమే తయారు చేసుకోవచ్చు. డ్రైనేజీ వాటర్తోనో, లేక ఇతర వాటర్ ఫిల్టర్లతోనో కాదు ఎయిర్ వాటర్ జనరేటర్‌తో!
దేశంలోనే మొదటిసారిగా గాలిలోని తేమతో నీటిని తయారుచేసే యంత్రాన్ని తయారు చేశారు ఐఐటీ ఇంజనీర్ అయిన అనిత్ అస్తాన. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఎలక్ట్రో వాటర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘‘థానేలోని ఓ ప్రాంతంలో నీటికోసం కిలోమీటర్లు నడిచి వేసవి వేడికి తాళలేక వడదెబ్బ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని దాహార్తిని తీర్చేందుకు సరైన ప్రత్యామ్నాయం ఉండాలన్న ఆలోచనతోనే ఈ యంత్రాన్ని రూపొందించా. దేశంలోని అన్ని రకాల ప్రాంతాల్లోనూ ఈ యంత్రాన్ని పరీక్షించాం. ఈ సరికొత్త నీటి తయారీ యంత్రం ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానుంది. మొదటి దఫాలో 15000 యూనిట్లు అమ్మాలని నిర్ణయించాం. గాలిలోని తేమను బట్టి రోజుకి 9 నుంచి 30 లీటర్ల వరకు ఈ జనరేటర్లు నీటిని ఉత్పత్తి చేస్తాయి. రెండు రకాల మోడళ్లతో ఈ వాటర్ జనరేటర్ మార్కెట్లోకి వస్తోంది’’ అని అనిత్ అస్తాన తెలిపారు.
ఇండియాలో ఎయిర్ వాటర్ జనరేటర్ కొత్తదే అయినా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌తో పాటు మరి కొన్ని దేశాల్లో ఇప్పటికే గాలిలోని తేమతో నీటిని తయారుచేసే యంత్రాలను వినియోగిస్తున్నారు. అయితే ఆ యంత్రాలన్నీ గాలిలో తేమ 50 నుంచి 60 శాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. భౌగోళిక వైవిధ్యం ఉన్న ఇండియా లాంటి దేశాల్లో గాలిలోని తేమ అన్ని చోట్లా ఒకేలా ఉండదు. అందుకే రాజస్థాన్ నుంచి కశ్మీర్ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు రాష్ట్రాలన్నింటిలోనూ అతి తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో ఈ ఎయిర్ వాటర్ జనరేటర్‌ను పరీక్షించారు. నిపుణుల పరీక్షలన్నీ పూర్తయ్యాక తుది మెరుగులు దిద్దుకుని అందుబాటు ధరలో అతి తొంద ర్లోనే ఎయిర్ వాటర్ జనరేటర్ మార్కెట్లోకి రానుంది.
- శ్రావణ్‌జయ