నిమిషానికి 1500 మీటర్లు కిందికి..
ఈజిప్టులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 217 మంది ప్రయాణికులతోపాటు ఏడుగురు సిబ్బంది దుర్మరణం చెందారు. రష్యాకు చెందిన కొగల్మావియా ఎయిర్ లైన్స్ విమానం (ఎయిర్ బస్ ఏ-321) సినాయి ద్వీపకల్పం మీదుగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా గల్లంతైంది. ఈ ఘటనపై మొదట గందరగోళం నెలకొంది. అయితే విమానం కూలిపోవటం వాస్తవమేనని, ప్రమాద స్థలాన్ని కూడా గుర్తించామని ఈజిప్టు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
ప్రయాణికులలో 90 శాతం మంది రష్యా పర్యాటకులే కావటం గమనార్హం. సినాయి ద్వీపకల్పంపై ప్రస్తుతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పట్టుండటంతో వారుగానీ ఈ ఘాతుకానికి పాల్పడిఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈజిప్టు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ముఖ్యాంశాలు కొన్ని..
ఎర్రసముద్ర తీరంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు విమానం బయలుదేరింది.
బయలుదేరిన 23 నిమిషాల తర్వాత.. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ పరిధికి అందకుండాపోయింది.
విమానం సైప్రస్ మీదుగా ప్రయాణించి గల్లంతైనట్లు మొదట భావించారు.
అంతలోనే సినాయిలోని హోసన్నా ప్రాంతంలో విమాన శకలాలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.
చివరకు ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్లామ్.. విమానం కూలిపోయినట్లు ప్రకటించారు. సహాయకబృందాలను రంగంలోకి దింపుతున్నట్లు చెప్పారు.
ప్రయాణికుల్లో అత్యధికులు మరణించి ఉంటారని ఈజిప్టు అధికారులు నిర్ధారించారు.
విమానంలో 217 మంది ప్రయాణికులు (వారిలో 17 మంది చిన్నారులు), ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు రష్యా అధికారగణం పేర్కొంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది రష్యాకు చెందిన టూరిస్టులే.
దాదాపు 40 అంబులెన్స్ లు ప్రమాద స్థలికి చేరుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది.
విమానం ఎందుకు కూలిందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే సమస్య తలెత్తిన తర్వాత విమానం ఒక్కో నిమిషానికి 1500 మీటర్లు కిందికి పడిపోయినట్లు తెలిసింది.
పీటర్స్ బర్గ్ లోని పుల్కోవ్ ఎయిర్ పోర్టులో హెల్స్ లైన్ ను ఏర్పాటుచేసి, ప్రయాణికుల కుటుంబాలకు సమాచారం అందిస్తున్నారు.
రష్యా సహాయబృందాలు వెంటనే ఈజిప్టుకు బయలుదేరాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు.