వంద విమానాలకు ఆర్డరిచ్చారు
ప్రయాణికులకు చవక విమానయానాన్ని అందిస్తున్న ఎయిర్ ఏషియా తాజాగా వంద కొత్త విమానాలు కొనడానికి ఆర్డర్ ఇచ్చింది. ఎ321 నియో రకం విమానాలను ఎయిర్ బస్ నుంచి కొనాలని ఎయిర్ ఏషియా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫార్న్బరోలో జరుగుతున్న ఎయిర్‌షోలో ప్రకటించారు. ఇప్పటికే ఈ సంస్థ వద్ద ఎయిర్ బస్ ఎ320 రకం విమానాలు 170 ఉన్నాయి. ఇవి భారతదేశంతో పాటు మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలలో తిరుగుతున్నాయి. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ బస్ ప్రెసిడెంట్ ఫాబ్రిస్ బ్రేగియర్ల మధ్య తాజా ఒప్పందం కుదిరింది.
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎ320 రకం విమానాలకు సంబంధించి ఇంత పెద్ద ఆర్డర్ రావడం ఇదే మొదటిసారి. ఎ321 నియోరకం విమానాలు తమ డిమాండుకు తగినట్లుగా సరిపోతాయని, దాంతోపాటు కిలోమీటరుకు అందుబాటులో ఉండే సీట్ల ఖర్చును కూడా బాగా తగ్గిస్తాయని టోనీ ఫెర్నాండెజ్ చెప్పారు. దీనివల్ల ప్రయాణికుల చార్జీలను తగ్గించే అవకాశం తమకు ఏర్పడుతుందన్నారు. మంచి మౌలిక సదుపాయాలున్న అన్ని ఎయిర్ పోర్టుల నుంచి ఈ విమానాలు నడిపిస్తామని, దానివల్ల ఒకే సమయంలో ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్లడానికి వీలుంటుందని తెలిపారు. ఈ రకం విమానాల్లో ఒకేసారి 236 మంది ప్రయాణికులను తీసుకెళ్లచ్చు.