Airline staff
-
అవమాన ప్రయాణం
కోల్‌కతా ఎయిర్పోర్ట్. వీల్ చైర్ కావాలని ఎయిర్‌లైన్ సిబ్బందిని కోరారు జీజా ఘోష్. ఎంతసేపటికీ రాలేదు. అదేమని విచారిస్తే ‘‘ఈరోజు స్టాఫ్ తక్కువగా ఉన్నారు’’ అని సమాధానం వచ్చింది సిబ్బంది నుంచి. ఎట్టకేలకు దీర్ఘ నిరీక్షణ తర్వాత వీల్ చైర్ వచ్చింది. తీరా చెకిన్ కౌంటర్‌కు వెళ్లాక ‘‘ఎవరూ తోడు లేకుండా మీరొక్కరే ప్రయాణం చేయడానికి వీల్లేదు’’ అని చెప్పారు ‘గో ఎయిర్’ చెకిన్ కౌంటర్లో. ఆశ్చర్యపోయారు జీజా.. ‘‘ఒంటరి ప్రయాణం నాకు కొత్తకాదు.. ప్రపంచమంతా ఒక్కదాన్నే చుట్టొస్తుంటా’’ అని. ఆ విషయాన్నే సిబ్బందితో చెప్పారు కూడా. అయినా ససేమిరా అన్నారు వాళ్లు. దాంతో తనతోపాటు న్యూఢిల్లీకి ప్రయాణం చేసే మిగతా సహచరులు వచ్చేవరకు ఆమెకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఆ సహచరుల్లోనే ఒకరైన కుహూ దాస్‌కూ ఇలాంటి అవమానమే ఎదురైంది! ఆమెకు పోలియో. దాంతో క్యాలిపర్స్ పెట్టుకొని వచ్చారు. సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) తనిఖీ కోసం ప్యాంట్స్ తీసేయమన్నారట. షాక్ అయ్యారు కుహూ దాస్.. ఇన్నేళ్లుగా ఫ్లైట్లలో ప్రయాణం చేస్తున్న తనకు ఏ రోజూ ఇలాంటి అవమానం ఎదురు కాలేదు. ‘‘వాళ్లు ఆ మాట అనగానే ఒక్క క్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయా. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఏ ఆఫీసర్ ఇలా అడగలేదు. ఇంత ఇన్సల్ట్ చేయలేదు’’ అన్నారు కుహూ. కుహూనే కాదు జీజా ఘోష్ కూడా వికలాంగురాలే. 2019 ఎలక్షన్ కమిషన్ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ కూడా అయిన జీజాకు సెరిబ్రల్ పాల్సి. ఈ ఇద్దరూ.. న్యూఢిల్లీలో జరగబోయే వికలాంగ మహిళల హక్కుల సమావేశానికి హాజరయ్యేందుకు మొన్న ఆదివారం కోల్‌కతా నుంచి బయలుదేరారు. ఆ సమయంలో వాళ్లకు జరిగిన అవమానం ఇది. ఈ సంఘటనలతో వాళ్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ వివక్ష మీద అక్కడే నిరసననూ తెలిపారు. దాంతో ఆ చెకిన్ కౌంటర్లోని వ్యక్తి ‘సారీ’ చెప్పింది ఈ ఇద్దరికి. ‘‘ఆ అమ్మాయి మీద మాకేం కోపం లేదు. ఇది ఆ అమ్మాయి ఒక్కరి తప్పు కాదు.. మాలాంటి వాళ్లను ఎయిర్‌లైన్ ఎలా ట్రీట్ చేస్తుందో.. ఎంత చులకనగా చూస్తుందో అనడానికి ఇదొక ఎగ్జాంపుల్’’ అన్నారు జీజా, కుహూ. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది జీజా ఘోష్, కుహూ దాస్‌లను క్షమాపణ కోరుతూ.. జరిగిన తప్పిదాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే పూచీని సంబంధిత ఎయిర్‌లెన్స్ అధికారులకు అప్పగించామని కోల్‌కతా ఎయిర్ పోర్ట్ సిబ్బంది ట్వీట్ చేశారు. ►మన దేశంలో దాదాపు ఎనిమిదికోట్ల మంది వికలాంగులున్నారు. రకరకాల వైకల్యాలతో బాధపడుతున్న వాళ్లకు కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాల సంగతేమో కాని పనిగట్టుకొని ఇలా అవమానించకుండా ఉంటే చాలు. -
ఎయిర్ ‘బస్సు’లో గొడవ
♦ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ప్రయాణికులకు వాగ్వాదం ♦ ప్రయాణికులను వదిలేసి రాయ్‌పూర్ వెళ్లిన ఇండిగో విమానం ♦ పోలీసుల రంగ ప్రవేశంతో ఇరుపక్షాల మధ్య సయోధ్య ♦ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రయాణికులను పంపిన ఎయిర్‌లైన్స్ సంస్థ శంషాబాద్: అది ఎయిర్ బస్సు.. కానీ అందులో గొడవ చోటు చేసుకోవడంతో ప్రయాణికులను వదిలేసి ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది.. పరిస్థితి పోలీసుల దాకా వెళ్లడంతో ఎట్టకేలకు సయోధ్య కుదిర్చారు. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ పెళ్లి విందులో పాల్గొనడానికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 70 మందితో కూడిన బంధువుల బృందం రెండురోజుల క్రితం నగరానికి వచ్చింది. శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్ వెళ్లడానికి వీరు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 466వ నంబర్ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అందరూ బంధువులే కావడంతో విమానంలో తమకు తోచిన విధంగా సీట్లలో కూర్చున్నారు. కానీ, టికెట్ బుకింగ్ ఆధారంగానే సీట్లలో కూర్చోవాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారికి సూచిం చారు. అందుకా బృందం అంగీకరించలేదు. ఈ విషయమై పెళ్లి బృందానికి, ఎయిర్‌లైన్స్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో రాత్రి 9 గంటలకు ప్రయాణికులను అక్కడే దించేసి విమానం టేకాఫ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో పెళ్లి బృందం ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గొడవకు దిగి.. అర్ధరాత్రి వరకు విమానాశ్రయంలో ఆందోళన చేపట్టింది. చివరకు ఆర్జీఐఏ పోలీసులు వచ్చి ప్రయాణికులకు, ఎయిర్ లైన్స్ సిబ్బందికి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో పెళ్లి బృందాన్ని శంషాబాద్‌లోని ఓ హోటల్లో బస చేయించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ శనివారం ఉదయం కొందరు ప్రయాణికులను, సాయంత్రం మరికొందరిని రాయ్‌పూర్‌కు వేర్వేరు విమానాల్లో పంపారు.