విమాన టికెట్ ధరలపై పరిమితి!
కొత్త పాలసీపై ప్రభుత్వం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణపు టికెట్ ధరలకు సంబంధించి కొత్త పాలసీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ అంశమై పౌర విమానయాన శాఖ, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ప్రభుత్వంలోని పలు ఇతర విభాగాలు ఇప్పటికే చర్చలను ప్రారంభించాయి. టికెట్ ధరలపై ఒక పరిమితి ఉండాలని అవి భావిస్తున్నట్లు సమాచారం. ఏ నిర్ణయమైనా అందరి ఏకాభిప్రాయం మేరకే ఉంటుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పండుగలు, డిమాండ్ అధికంగా ఉన్న సీజన్లలో విమానయాన సంస్థలు వాటి టికెట్ ధరలను ఒకేసారి విపరీతంగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. కాగా గంట విమాన ప్రయాణానికి టికెట్ ధర రూ.2,500గా ఉండాలని పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా టికెట్ ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది.