మా భూమి సెంటు కూడా ఇవ్వం
ముక్తకంఠంతో తేల్చిచెప్పిన జక్కులనెక్కలం వాసులు
విమానాశ్రయం విస్తరణ కోసం భూసేకరణపై గ్రామసభ
జక్కులనెక్కలం (గన్నవరం రూరల్) :
‘మా గ్రామానికి హాని చేసే ఏలూరు కాలువ మళ్లింపు చేయవద్దు’ అంటూ జక్కులనెక్కలం గ్రామస్తులు ముక్కకంఠంతో తేల్చిచెప్పారు. జక్కులనెక్కలం పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించారు. నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ ‘ఇప్పటికే ముంపుతో, మురుగుతో అల్లాడిపోతున్నామని, విమానాశ్రయ విస్తరణ పేరుతో మా గ్రామంలో భూములు సేకరించి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఏలూ రు కాలువ, రెండు వైపులా బుడమేరు, మరో వైపు వాగులతో తీవ్ర ఇబ్బందుల మధ్య బతుకుతున్నామని, ఈ పరిస్థితుల్లో విమానాశ్రయ విస్తరణ కోసం మా పంట భూములు లాక్కుంటే తాము ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు. 150 మంది మహిళలు పాల్గొని.. ఈ విషయంపై మరో మాట లేదని, ప్రభుత్వానికి జక్కులనెక్కలం గ్రామస్తుల అభిప్రాయం తెలియజేయాలని నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. రైతు నాయకుడు గూడవల్లి న రసింహారావు (నర్సయ్య) మాట్లాడుతూ కేవలం 6.5 కిలోమీటర్లు దక్షిణం వైపు విమానాశ్రయం విస్తరించే వీలుండగా 13 కిలోమీటర్లు మళ్లిస్తున్నారని, దీనిపై నిపుణుల కమిటీ సూచనలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సర్వే నిర్వహించి రైతులకు ఇబ్బంది లేకుండా 6.5 కిలోమీటర్లలో విమానాశ్రయ విస్తరణ చేపట్టాలని సూచించారు. రైతు ముప్పలనేని రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద భూములు తీసుకునే సందర్భంలో నిబంధనలు పాటించటం లేదని విమర్శించారు. గ్రామసభ సందర్భంగా జక్కులనెక్కలం గ్రామస్తులు విమానాశ్రయ విస్తరణ కోసం ఏలూరు కాలువ మళ్లింపును తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామస్తులందరూ ఒకే మాటపై నిలబడి రెవెన్యూ శాఖ అందించిన పత్రాలను సైతం తీసుకునేందుకు నిరాకరించారు. సర్పంచ్ కాట్రు ఏసుమ్మ మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయాన్ని అధికారులు ప్రభుత్వానికి తెలియజేయాలని, సెంటు భూమి ఇచ్చేందుకు మా గ్రామం సిద్ధంగా లేదని చెప్పారు. దీంతో అధికారులు ప్రసంగాలు, గ్రామస్తుల అభిప్రాయాలు నమో దు చేసుకుని వెళ్లిపోయారు. కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, తహసీల్దారు మాధురి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.