Airport official
-
ఎయిర్‌పోర్టు అధికారుల దురుసు ప్రవర్తన
గన్నవరం: రాంగ్ పార్కింగ్ చేశాడని ఓ వాహనదారుడిపై ఎయిర్‌పోర్టు అధికారులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన వివాదస్పదమైంది. వివరాలీలా వున్నాయి. గుంటూరుకు చెందిన జీహెచ్. రావు హైదరాబాద్ నుంచి విమానంలో వస్తున్న బందువును తీసుకువెళ్ళేందుకు కారుతో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. టెర్మినల్ భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాన్ని నిలిపి బందువును రిసీవ్ చేసుకుని కారు వద్దకు వచ్చారు. ఇంతలో కారు ముందు టైరును లాక్‌చేసి ఉండడం చూసి అవాక్కయ్యాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అడుగుగా రాంగ్ పార్కింగ్‌లో పెట్టినందుకు టెర్మినల్ బాధ్యతలు చూస్తున్న అధికారి యశ్వంత్ లాక్‌చేసినట్లుగా చెప్పారు. దీనితో జీహెచ్. రావు సదరు యశ్వంత్‌ను కలువగా రూ. 3 వేలు జరిమానా కట్టి కారును తీసుకువెళ్ళాలని చెప్పాడు. ఇదేమని ప్రశ్నించిన ఆతనిపై యశ్వంత్ దురుసుగా ప్రవర్తించడంతో వీరి మధ్య మాట మాట పెరిగి వాగ్వావాదానికి దారితీసింది. జరిమానా కట్టిన తర్వాతే కారు విడుదల చేస్తామని చెప్పడంతో చేసేది లేక డబ్బులు కట్టి కారును తీసుకువెళ్ళారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రయాణికులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, తోటి వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అధికారులు దురుసు ప్రవర్తనతో ఎయిర్‌పోర్టుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారంటూ మండిపడుతున్నారు. రాంగ్ పార్కింగ్‌లో వాహనాలు నిలపవద్దని చెప్పాల్సిందిపోయి వేల రూపాయిలు జరిమానా రూపంలో వసూలు చేయడం దారుణమని పేర్కొంటున్నారు. -
విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే రోజా
సాక్షి, శంషాబాద్: ఇండిగో ఫ్లైట్.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది... ఇంతలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే రోజాతోపాటు 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం సమయంలో విమానాన్ని సుమారు గంటపాటు రన్‌వేపైనే ఉంచారు. గేట్లు కూడా తెరవలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే ఆర్కే రోజా సాక్షి, తిరుపతి: ‘శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు కనిపించాయి. తర్వాత పెద్ద కుదుపుతో రన్‌వే పై ఆగిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా. నేను, ఇతర ప్రయాణికులు వణికిపోయాం. అరగంట పాటు విమానం డోర్లు తీయలేదు. అగ్నిమాపక సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశార’ని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వెల్లడించారు. బుధవారం రాత్రి పది గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో విమానంలో ఆమె హైదరాబాద్ బయలుదేరారు. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం టైర్లు పేలిపోయినట్లు తెలిసిందని రోజా సాక్షికి వివరించారు. మంటలు చూసి ప్రయాణికులందరూ ఒక్క ఉదుటన కిందకు దిగాలని ప్రయత్నం చేసినా, ఎయిర్‌హోస్టెస్ నిరాకరించడంతో సాధ్యం కాలేదన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని వెల్లడించారు. -
లైంగిక ఆరోపణలతో ఎయిర్పోర్ట్ అధికారి అరెస్టు
న్యూఢిల్లీ: ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఇమ్మిగ్రేషన్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని బెయిల్‌పై విడుదల చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 18న వినోద్ కుమార్ అనే ఇమ్మిగ్రేషన్ అధికారి హాంకాంగ్ వెళ్లేందుకు వచ్చిన బెంగళూరుకు చెందిన మహిళను మాటలతోను, చేతలతోనూ అసభ్య కరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అడగకూడని ప్రశ్నలు అడగడంతోపాటు ఆరోజు తనను ఫాలో అయ్యాడని, ఎస్కలేటర్‌పై వెళుతున్నప్పుడు కూడా వెనుకాలే వచ్చాడని ఆమె బెంగళూరు పోలీసులకు తెలిపింది.